
చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజులు అవి. ‘ఇదిగో చిరంజీవి, డి.కామేశ్వరిగారు అనే అతను రాసిన ‘కొత్త మలుపు’ అనే నవలను, మనం ‘న్యాయం కావాలి’ అనే టైటిల్ తో సినిమాగా చేస్తున్నాం, రెడీగా ఉండు’ అంటూ నిర్మాత క్రాంతి కుమార్ గారు చిరంజీవితో అన్నారు. ‘కథ ఏమిటండీ అని అడగాలని చిరంజీవికి మనసులో ఉన్నా సైలెంట్ గానే ఉండిపోయారు. ఎందుకంటే, తానూ హీరోగా నిలబడటానికి క్రాంతిగారి సపోర్ట్ ఎంతో ఉంది. అందుకే, ఆయనను చిరంజీవి గురువుగా భావించే వారు.
కాకపోతే, మొదటి నుండి ‘సినిమాకి కథే మెయిన్’ అని నమ్మే వ్యక్తి చిరంజీవి. నేరుగా ఆ నవల పట్టుకుని రచయిత సత్యానంద్ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టారు. నిద్ర మత్తు నుండి పైకి లేచి టైమ్ చూసుకున్నారు సత్యానంద్. కరెక్ట్ గా అప్పుడు అర్ధరాత్రి 12 అవుతుంది. ‘ఈ సమయంలో ఎవరై ఉంటారు ?’ అనుకుంటూ వెళ్లి డోర్ తీస్తే ఎదురుగా చిరంజీవి. ‘ఏమటయ్యా ? ఇలా ఈ టైంలో వచ్చావ్ ?’ అంటూ ఆవలిస్తున్నారు సత్యానంద్.
చిరంజీవి అప్పటికీ పెద్ద స్టార్ ఏమి కాదు. అందుకే, చిరు రిక్వెస్ట్ చేస్తూ.. ‘సత్యానంద్ గారు క్షమించాలి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. గురువుగారు ‘కొత్త మలుపు’ అనే నవలను నాతో సినిమాగా చేద్దామనుకుంటున్నారు. ఆయన గురించి మీకు తెలుసు కదా. వెంటనే అన్ని మొదలుపెట్టేస్తారు. ఒకసారి ఆ నవల చదివి, అది నాకు సూట్ అవుతుందో లేదో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలరు’ అంటూ చిరు మాట్లాడుతూ ఉన్నాడు.
కొత్తగా వచ్చిన హీరో తనకు ఏమి రాకపోయినా ఒక కథను జడ్జ్ చేసే ఈ సినిమా ప్రపంచంలో కథను అర్థం చేసుకునే అవగాహన ఉన్నపటికీ రచయిత అభిప్రాయం తెలుసుకోవడానికి ఒక హీరో ఇలా రావడమా ? అనే షాక్ లోనే సత్యానంద్ చిరును అలాగే చూస్తూ ఉండిపోయారు. నిజానికి అప్పటికే సత్యానంద్ స్టార్ రైటర్. పైగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి హీరోలకు ఆయన మంచి సన్నిహితుడు కూడా.
కానీ, చిరంజీవి అప్పుడే హీరోగా వచ్చిన కొత్త కుర్రాడు. అందుకే సత్యానంద్, మొదట్లో చిరంజీవితో బాగా సన్నిహితంగా ఉండేవారు కాదు. కానీ, ఆ రాత్రి జరిగిన సంఘటనతో సత్యానంద్ కి చిరంజీవి పై గౌరవం నమ్మకం పెరిగాయి. అప్పటి నుండే ఆయన చిరంజీవి చిత్రాలకు ప్రత్యేకంగా పనిచేసేవారు. చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి వెనుక సత్యానంద్ రచనా బలం కూడా ఎంతో ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మెగాస్టారే చెప్పారు.