Telugu Cinema: నేటి సినిమా పండితులంతా కలిసి ఒక ముచ్చట పెట్టుకున్నారు. ఆ ముచ్చటలో ముఖ్యాంశం ఏమిటంటే.. తెలుగు సినిమా రంగాన్ని మార్చేసిన ఒక ఆరు చిత్రాలు ఏవి ? ఆ చిత్రాలే ఎలా మార్చాయి ? అంటూ ఒక ప్రశ్న వేసుకుని.. ఆ ప్రశ్న చుట్టూ ఆ సినిమాల సంగతులు చెప్పుకుంటూ మొత్తానికి ఒక ఆరు చిత్రాలను తేల్చారు. మరి ఆ చిత్రాలు ఏమిటో మనం చూద్దాం.
మిస్సమ్మ, గుండమ్మ కథ :
ఈ జాబితాలో రెండు చిత్రాలకు సమస్థానం ఇచ్చారండోయ్. కారణం స్క్రీన్ ప్లే అట. చిన్న కథావస్తువును రంజింపజేసే స్క్రీన్ ప్లేతో అద్భుతమైన చిత్రంగా మలచవచ్చని ఋజువు చేసిన సినిమాలు ఇవి, అందుకే, వీటికి మొదటి స్థానం ఇస్తున్నామని తేల్చి చెప్పారు. అన్నట్టు ఈ చిత్రాల గొప్పతనం చెప్పాలి అంటే.. మాటల్లో చిన్న చిన్న చమక్కులు, ఆహార్యం, ముఖవైఖరుల్లో సున్నితమైన విరుపులు, అద్భుతమైన నటన.. ఇలా అన్నీ వెరసి ఈ చిత్రాలు గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి.
పాతాళ భైరవి, మాయాబజార్ :
ఇవి ఎందుకు గొప్ప చిత్రాలుగా నిలిచాయి అని ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. ప్రతి తెలుగు వాడికి తెలుసు. కంప్యూటర్లు లేని కాలంలో కళ్ళను కట్టిపడేసే గ్రాఫిక్స్ కేవలం ఈ చిత్రాలతోనే సాధ్యం అయింది అని. పైగా సృజన ఆకాశమంతైనా తెరపై చూపటం అనేది హాలీవుడ్‌కే కాదు, తెలుగు వాళ్లకు సాధ్యమే అని నిరూపించిన మొదటి చిత్రాలు ఇవి.
మల్లీశ్వరి :
ఎన్టీఆర్, భానుమతి గారి నట విశ్వరూపం ఆవిష్కరించిన సినిమా ఇది. పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడిన మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే.
శంకరాభరణం :
సంగీతం ప్రధానంగా, తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త కథానాయకుడి తరహాను, అప్పటి దాకా వచ్చిన కథాచారాలకు విరుద్ధమైన కథాంశాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి సినిమా. అందుకే ఈ సినిమాకు ఈ జాబితాలో స్థానం లభించింది.
ఖైదీ :
మాస్ సినిమాలకు తొడగొట్టి ఉనికిని చాటుకునేలా చేసిన సినిమా ఇది. పైగా చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన సినిమా ఇది.
శివ :
ఈ సినిమా గురించి ఏం చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా రూపురేఖలను మార్చిన సినిమా ఇది. చిత్రీకరణ, హీరోయిజం, విలనిజంలలో కొత్త శకానికి తెర తీసిన సినిమా ఇది.
Also Read: తెలుగు హీరోలను జస్టిస్ ఎన్వీ రమణ అంత మాటన్నాడా..?