Telangana Elections 2023: బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమనేత ఈటల రాజేందర్‌కు కనీసం సొంత కారు కూడా లేదట. ఇది మేం చెబుతున్నది కాదు.. స్వయంగా ఈటల రాజేందరే తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాదాపు 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈటల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ మొదటి, రెండో క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కానీ, సొంత కారు కూడా కొనుక్కోలేకపోయారట.
ఆస్తులు ఇవీ..
హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ఆయన సోదరుడు భద్రయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్‌లో ఈటల నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులకు ఆస్తులు, కేసుల వివరాలు అఫిడవిట్ అందజేశారు. ఈటలకు సొంత కారులేదని, ఆస్తులు రూ.16,74,473 ఉండగా, భార్య పేరుతో ఉన్న షేర్స్, బాండ్స్, వెహికిల్స్, పర్సనల్ అడ్వాన్సెస్ కలిపి రూ.26,48,70, 394 చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈటల చేతిలో నగదు రూ.లక్ష, ఆయన భార్య జమున వద్ద రూ. లక్షన్నర మాత్రమే ఉన్నాయన్నారు.
కోట్ల స్థిరాస్తులు..
రాజేందర్ స్థిరాస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.12.50 కోట్లు ఉండగా, జమున పేరిట రూ.14.78 కోట్లు ఉన్నాయని తెలిపారు. జమున పేరిట జమున హ్యాచరీస్‌తోపాటు అభయ డెవలపర్స్, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్, ఎస్వీఎస్ అర్చవాన్ అండ్ డొలరైట్ అనే కంపెనీల్లో పెట్టుబడులున్నాయన్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులు, ఎన్నికల కేసులు కలిపి ప్రస్తుతం ఈటల రాజేందర్పై 40 కేసులు ఉన్నట్లు వివరించారు.
అయినా కారు కొనుక్కోలేదట..
నగదు తక్కువగా ఉన్నా ఈటల రాజేందర్‌తోపాటు ఆయన భార్య జమున పేరిట స్థిరాస్తులు కోట్లలో ఉన్నాయి. అప్పులు ఏమీ లేవు. పలుకంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయి. కానీ, కారు కొనుగోలు చేయలేదని ఈటల పేర్కొన్నారు. ఎన్నిలక కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల ఎక్కడకు వెళ్లినా కారులోనే వెళ్తారు. అయినా తనకు కారు లేదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతలు చాలా వరకు తమ పేరిట వాహనాలు, ఆస్తులు పెట్టుకోరు. ఈటల కూడా అదే చేశారని భావిస్తున్నారు.