Rajinikanth: 74 ఏళ్ళ వయస్సులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ చెక్కు చెదరని స్టార్ స్టేటస్ తో వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ నేటి తరం స్టార్ హీరోలకు ధీటుగా ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన స్టార్ డమ్ ని మ్యాచ్ చేసే హీరో ఇండియాలోనే లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రజినీకాంత్ కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అనేకసార్లు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా చెడిపోవడం, గుండెపోటు తో ఆసుపత్రి పాలవ్వడం వంటివి జరిగాయి. ఒకానొక సందర్భంలో ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది కూడా. అభిమానులు భయబ్రాంతులకు గురయ్యారు. అలాంటి పరిస్థితే సరిగ్గా రెండు రోజుల క్రితం మరోసారి రజినీకాంత్ కి ఎదురైంది. మొన్న అర్థరాత్రి ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, తమ ఆరాధ్య దైవం కి ఏమి కాకూడదు అని దేవుడికి ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు.
ఎట్టకేలకు రజినీకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన సురక్షితంగానే ఉన్నాడని, గుండెకు అవసరమైన స్టెంట్ వేసాము అని చెప్పడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టియాన్’,’ కూలీ’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘వెట్టియాన్’ చిత్రం ఈ నెల 10 వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిత్రంతో పాటు సమాంతరంగా రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఈ సినిమా కూడా 50 శాతం వరకు పూర్తి అయ్యింది. అయితే కోలీవుడ్ నుండి అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే, ఈ రెండు సినిమాల తర్వాత రజనీకాంత్ శాశ్వతంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు సినిమాలకు దూరంగా ఉండాల్సిందిగా సూచించినట్టు సమాచారం. దీంతో ‘కూలీ’ చిత్రమే రజినీకాంత్ చివరి చిత్రం అయ్యే అవకాశాలు 90 శాతం ఉన్నాయట. గతంలో కూడా రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితుల కారంగానే రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను ఉపసంహరించుకున్నాడు. దీనిపై అనేక విమర్శలు ఎదురైనప్పటికీ అదే నిజం.
ఇప్పుడు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల కారణం చేతనే సినిమాలు కూడా వదిలేయబోతుండడం ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశ కలిగిస్తుంది. కానీ మనిషి ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటే చాలు, సినిమాలు అక్కర్లేదని రజినీకాంత్ సన్నిహితులు అంటున్నారు. ఇక రజనీకాంత్ ‘కూలీ’ సినిమా విశేషాల్లోకి వెళ్తే, ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.