Pushpa 2 Movie ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం మేనియా దేశ వ్యాప్తంగా ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం, క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ గురించి కొన్నేళ్లు మాట్లాడుకునేలా ఉన్నాయి. దాదాపుగా ఏడేళ్ల నుండి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి బాహుబలి 2 వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం అవలీలగా దాటేయబోతుందని, మొదటి వారం పూర్తి అయ్యేలోపే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే ఏకైక చిత్రం గా ఈ సినిమా నిలుస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు రాగా, ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని, ప్రతీ సన్నివేశంలోనూ ఆయన అంత అద్భుతంగా నటించాడని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతీ క్యారక్టర్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది.
ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ అన్నయ్య గా ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ అజయ్ నటించిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో ఆయన క్యారక్టర్ కి కొనసాగింపుగా ఈ చిత్రంలో ఆయన క్యారక్టర్ ఉంటుంది. వరుసకు అన్నయ్య అయినప్పటికీ కూడా, సవతి కొడుకు అవ్వడంతో అజయ్ అల్లు అర్జున్ ని తన కొడుకుగా అంగీకరించడు. కానీ రెండవ భాగంలో అతని కూతురు కోసమే అల్లు అర్జున్ యుద్ధం చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం ప్రధానంగా ఈ అమ్మాయి క్యారక్టర్ చుట్టూనే తిరుగుతుంది. జాతర ఫైట్ సన్నివేశాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సన్నివేశం నుండి ఈ అమ్మాయి బాగా హైలైట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మొత్తం ఈ అమ్మాయి మీదనే ఉంటుంది. పార్ట్ 1 లో కూడా ఈమె ఉంటుంది కానీ, కేవలం రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అవుతుంది.
కానీ పుష్ప 2 లో ఆమె మీదనే దాదాపుగా సెకండ్ హాఫ్ మొత్తం నడవడం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఈ అమ్మాయి బాగా ఫోకస్ అవ్వడం వంటివి జరిగాయి. ఇంతకీ ఈ క్యారక్టర్ పోషించిన అమ్మాయి పేరు పావని కరణం. ఈమె వైజాగ్ కి చెందిన అచ్చ తెలుగు అమ్మాయి. పుష్ప పార్ట్ 1 చిత్రం ఈ అమ్మాయికి మొదటి సినిమా. ఇంజనీరింగ్ చదువు ని పూర్తి చేసి, ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి ఈ అమ్మాయికి సినిమాల మీద విపరీతమైన ఇష్టం ఉండడం వల్ల చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిగా సినిమాల మీదనే తన ద్రుష్టి పెట్టింది. పుష్ప చిత్రం ఆడిషన్స్ లో వేలాది మందిలో ఒకరిగా ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు ‘పరేషాన్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది కానీ, ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొచ్చింది. ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్రం తో బాగా హైలైట్ అయిన పావని, తన తదుపరి చిత్రం ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో చేస్తుంది. ఈ సినిమాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుందట ఈ అమ్మాయి.
