NTR- Krishna: సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ కు, హీరో కృష్ణకు విభేదాలు ఎక్కడ మొదలయ్యాయో ఎవరూ చెప్పరు. ఈ విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ వెల్లడించలేదు. హీరో కృష్ణ ఎక్కడా బయటపడలేదు. కానీ సీనియర్ ఎన్టీఆర్ కు ఎదురు వెళ్లి హీరో కృష్ణ కాపు కులస్తులకు హీరో అయ్యారు. బహుశా శెట్టిబలిజ కులానికి చెందిన విజయనిర్మలను రెండో వివాహం చేసుకోవడం ద్వారా ఆయనను కాపు కులస్తులు ఓన్ చేసుకున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కు ఎదురు వెళ్లడం ద్వారా కమ్మ కులస్తులు కృష్ణను వ్యతిరేకించారని అప్పట్లో ప్రచారం జరిగింది.. హీరో కృష్ణకు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మంచి స్నేహితుడు. ఆయన ప్రోత్సహించడంతోనే రాజకీయాల్లోకి వచ్చారు.. ఇది సీనియర్ ఎన్టీఆర్ కు నచ్చలేదని అప్పట్లో సినీ వర్గాలు అంటూ ఉండేవి. ఇదే సమయంలో 1989లో ఏలూరు పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కృష్ణ గెలుపొందారు. ఎప్పుడైతే కృష్ణ గెలుపొందారో అప్పటినుంచి సీనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు మరింత తారస్థాయికి వెళ్ళాయి. అయితే 1991లో అదే స్థానం నుంచి కృష్ణ పోటీ చేస్తే ఎన్టీఆర్ వర్గీయులు ఓడించారని సమాచారం.

కృష్ణను ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు
ఒకానొక దశలో కృష్ణను ఎన్టీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.. ఆర్థికంగానూ దెబ్బ కొట్టారు. దీంతో కృష్ణ ఎన్టీఆర్ ను బహిరంగంగానే వ్యతిరేకించారు.. మరి ముఖ్యంగా సాహసమే నా ఊపిరి అనే సినిమాలో రంగా హత్యను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఘనత కృష్ణకే దక్కుతుంది. ఇక తన సినిమాలు ఫ్లాఫ్ అయితే నిర్మాతలకు రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసేవారు. ఇలా తన దాతృత గుణం వల్ల ఎన్నో ఆస్తులను అమ్ముకొని అప్పుల పాలయ్యారు. మహేష్ బాబు హీరోగా ఎదిగిన తర్వాత కృష్ణ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు.
కృష్ణ తొలి సిల్వర్ జూబ్లీ విజయోత్సవానికి ఎన్టీఆర్ వచ్చారు
హనుమంతరావు నిర్మాణంలో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో పండంటి కాపురం అనే సినిమాలో కృష్ణ నటించారు. 1972 జూలై 21 న ఈ సినిమా విడుదలైంది. హీరో కృష్ణ కు ఇది తొలి సిల్వర్ జూబ్లీ సినిమా. ఈ సినిమా విజయోత్సవ సభకు ఎన్టీఆర్ మేకప్ తోనే వచ్చి కృష్ణను అభినందించారు. వీరిద్దరి మధ్య మనస్పర్ధల గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి. తాను ఎన్టీఆర్ అభిమానినని, ఆయన స్పూర్తితోనే తాను సినీ రంగానికి వచ్చానని కృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు. ఇక కృష్ణ తన కెరీర్ ప్రారంభంలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్త్రీ జన్మ, నిలువు దోపిడీ, విచిత్ర కుటుంబం అనే సినిమాల్లో నటించారు. తన సొంత చిత్రం దేవుడు చేసిన మనుషులు సినిమాలో కోరిమరి ఎన్టీఆర్ ను నటింప చేశారు. 1980 దశకంలో ఎన్టీఆర్, అభిమానుల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. అందువల్లే వారిద్దరి మధ్య సంబంధాల విషయమై చాలా కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కృష్ణ నిర్మించిన పద్మాలయ స్టూడియోస్ 1983, ఆగస్టు 14న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అలాగే 2003 వ సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కృష్ణ అందుకున్నారు.

మనస్పర్థలు తొలగిపోయాయి
తర్వాత కాలంలో వీరిద్దరి కుటుంబాల మధ్య మనస్పర్ధలు తొలిగిపోయాయని సినీ వర్గాలు అంటూ ఉంటాయి. ఈ తరానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఎంతో సఖ్యతగా ఉంటారు. భరత్ అనే నేను సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు మహేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు ఆయనతో పంచుకున్నారు. కాకపోతే ఆ కాలంనాటి అభిమానులు ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే పెద్దలు అంటారు కాబోలు కాలం గాయాలను మాన్పుతుందని..