Kantara: రిషబ్ శెట్టి.. సినిమా ప్రపంచంలో అడుగు పెట్టినా.. పుట్టి పెరిగిన మట్టి వాసన మరవని మనిషి. ఆయన చెక్కిన శిల్పమే కాంతారా. 60 ఏళ్లు దాటిన భూతకోల కళాకారులకు పింఛన్లు ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఈ సినిమా ప్రభావానికి ప్రత్యక్ష నిదర్శనం. ఒక లోబడ్జెట్ చిత్రంతో సంచలనం కూడా చిన్నబోయేలా చేసిన రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభకు దేశం మొత్తం జేజేలు పలుకుతోంది.. పల్లె కథను, ఆచార సంస్కృతిని, ప్రకృతి, మానవ సంబంధాలను పొదుపుగా వెండితెరపై అభినయించిన నటనకు ప్రేక్షకలోకం నీరాజనం పలుకుతోంది.

ఆ ప్రయాణం ఇలా మొదలైంది
రిషబ్ స్వగ్రామంలో రకరకాల సంప్రదాయ కలలు ఉనికిలో ఉన్నాయి. గ్రామీణ సంస్కృతి, కళారూపాల మీద రిషబ్ కు బాల్యంలోనే ఆసక్తి మొదలైంది. సినీ పరిశ్రమకు వచ్చాక వాటి గొప్పతనాన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయాలని రిషబ్ అనుకున్నారు. అందులో భాగంగానే విభిన్న కథలు, సామాజిక అంశాలను స్పృశిస్తూ పల్లె సంస్కృతి నేపథ్యంలో సినిమా తీయాలి అనుకున్నారు. ఓ అటవీ అధికారి, గ్రామీణ యువకుడికి మధ్య చాలా ఏల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా అల్లుకున్న కథ కాంతారా. తన పొలాన్ని వన్యమృగాల నుంచి కాపాడుకునేందుకు తుపాకీ ఉపయోగించిన యువకున్ని పోలీసులు అరెస్టు చేసి, ఖైదు చేస్తారు. సినిమాలో చూపించినట్టు అతడి గన్ బ్యాక్ ఫైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్ గాయపడటంతో అతనిని అరెస్టు చేస్తారు. ఈ సంఘటన ఆధారంగా మిగతా కథను తయారు చేసుకున్నారు. రెండో విడత లాక్ డౌన్ లో ఇంటి పట్టున ఉన్నప్పుడు ఈ లైన్ తో కాంతారా సినిమా చేయాలనే ఆలోచన రిషబ్ కు వచ్చింది. కాంతారా కేవలం ఇద్దరు వ్యక్తుల అహంకారం సమస్య కాదు. ప్రకృతి, మనుషుల మధ్య సమస్య. మానవజాతి ఆవిర్భావం నుంచి ఈ సమస్య ఉంది.. దానిని కాంతారా సినిమాలో రిషబ్ చాలా పకడ్బందీగా చూపించాడు. రిషబ్ గ్రామంలో దైవారాధనను భూత కోల విధానంలో చూపుతారు. ప్రకృతికి, మనిషికి మధ్య వారధి లా ఉంటుందనే ఒక సందేశాన్ని ఈ పూజా విధానం ద్వారా తెలియజేశారు. దాన్ని ఆధారంగా తీసుకొని అందమైన రీతిలో ఈ కథను మలిచారు. వ్యవసాయ పనుల్లో మొదటి నుంచి ఒక సంస్కృతి ఉంటుంది. సంప్రదాయాలు, పూజలు, నమ్మకాలు, దేవుడు, ఉత్సవాలు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఇదే మనిషి జీవితానికి స్ఫూర్తి.
ఇంతకీ రిషబ్ స్వగ్రామం ఏంటంటే
రిషబ్ స్వగ్రామం కర్ణాటక రాష్ట్రంలోని పుట్టాపూర్ తాలూకాలోని కెరాడీ. బెంగళూరు నగరానికి 500 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. కొల్లూరు మూకాంబిక దేవాలయానికి దగ్గరగా చుట్టూ అడవులు, కొండల మధ్య ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఒకే దారిలో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. రిషబ్ చదువంతా కన్నడ మాధ్యమంలోనే సాగింది. రిషబ్ కుటుంబం కంబళ( దున్నపోతుల పరుగు పందెం) పోటీల్లో పాల్గొనేది.. వాటిని చూస్తూ రిషబ్ పెరిగాడు. ఇప్పటినుంచే అతడికి వారి పూర్వీకుల సంస్కృతిపై గౌరవం ఏర్పడింది. ప్రాంతీయత, ఉప ప్రాంతీయత అనే విషయాలపై విశ్వజనీన తత్వం ఆధారపడి ఉందని అతడికి బలమైన నమ్మకం ఏర్పడింది. ఈ ఆలోచనలనే అతడు సినిమా మాధ్యమం ద్వారా ప్రపంచం ముందు ఉంచాలనుకున్నాడు. తన మూలాలతో పెనవేసుకున్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నాడు. మూలాలకు, సాంస్కృతికి దూరమవుతున్న ఈ తరానికి వాటి గొప్పతనం తెలియజేప్పడం తన బాధ్యత అనుకొని ఈ సినిమా తీశాడు. పురాణాల ప్రకారం కోస్తా కర్ణాటక మొత్తం పరశురామ సృష్టి. అన్నప్ప, నాగదేవతలను ఇక్కడి ప్రజలు కొలుస్తారు. దేవుడంటే ప్రకృతిలోని ఒక శక్తి అని, దేవుడు భక్తులను ఆవహించడం, తన మాటను వారి ద్వారా ప్రకటించడం, ఆశీస్సులు అందించడం ఇవన్నీ చిన్నప్పటినుంచి చూస్తూ రిషబ్ పెరిగాడు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా ఈ చక్రాన్ని మొత్తం నాశనం చేస్తున్నదని, అదే విషయాన్ని రిషబ్ ఈ సినిమా ద్వారా చాటి చెప్పాడు. మరి ముఖ్యంగా 1980లో వచ్చిన అటవీ చట్టం ద్వారా ఈ సమస్యలు మొదలయ్యాయని చెప్పకనే చెప్పాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి..
రిషబ్ శెట్టి చదువు విషయానికొస్తే.. అతడు 2004లో డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాల్లోకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదిగాడు. సైనైడ్ అనే సినిమాకు లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దేవ్ లాంటి దిగ్గజాలతో పనిచేశాడు. వారితో పని చేయడం ద్వారా అతడిలో సినిమాను చూసే దృక్పథంలో మంచి మార్పు తెచ్చింది. అదే సమయంలో తుగ్లక్ అనే సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా చేస్తే, రిషబ్ శెట్టి విలన్ గా చేశాడు. అప్పుడే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అదే క్రమంలో నక్సలిజం నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథను రక్షిత్ హీరోగా రికీ అనే పేరుతో రిషబ్ శెట్టి తీశాడు. దర్శకుడుగా అతడికి తొలి సినిమా ఇది.. కానీ అది యావరేజ్ గా నిలిచింది.. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు కిరాక్ పార్టీ అని సినిమా తీస్తే కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తర్వాత ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కథతో “సర్కారీ హిరియా ప్రాథమిక శాలి” అనే సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలిచింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకుంది. తన కెరీర్లో లీడ్ రోల్ లో నటించిన బెల్బాటం అనే సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ రాబోతోంది.. ఇక కాంతారా సినిమాలో భూత కోల సమయంలో వినిపించే సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. అదంతా జానపద శైలిలో సాగుతుంది.. సన్నివేశాన్ని అందరూ అనుభూతి చెందాలంటే అక్కడ సంగీతం కూడా యూనివర్సల్ గా ఉండాలి. అందుకే వెస్ట్రన్, మ్యూజిక్ ని మిలితం చేశారు. సాహిత్యం కోసం సంస్కృతాన్ని వాడారు. అయితే వైదిక పద్ధతిని ప్రచారం చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. హిందూ సమాజంలో మన ధర్మంలో దైవం అంటే ఒక ఫీల్ ఉంటుంది దాన్ని అక్కడ అనుభూతి చెందాలని అలా చేశామని రిషబ్ స్పష్టం చేశాడు. లో బడ్జెట్ సినిమాతో ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న రిషబ్.. మునుముందు ఇంకా ఎటువంటి కథలను సినిమాలుగా తీస్తారో వేచి చూడాల్సి ఉంది.