Pushpa 2: ఎన్టీఆర్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం దాన వీర శూర కర్ణ. ఈ మూవీ నిడివి ఒక హాట్ టాపిక్. 3:41 గంటల నిడివితో 1977లో ఆ చిత్రం విడుదలైంది. రెండుసార్లు ఇంటర్వెల్ వేసేవారట. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అందుకుంది. క్రమేణా సినిమాల నిడివి తగ్గుతూ వచ్చింది. ప్రేక్షకుల అభిరుచి ఆధారంగా, రెండు గంటలకు అటూ ఇటుగా సినిమాల నిడివి ఉండేది. హాలీవుడ్ చిత్రాల నిడివి రెండు గంటల లోపే ఉంటుంది. ఇటీవల యానిమల్ మూవీ రన్ టైం చర్చకు దారి తీసింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ రన్ టైం 3:21 గంటలు. యానిమల్ డిస్ట్రిబ్యూటర్స్ రన్ టైం తగ్గించాలని సందీప్ రెడ్డిని కోరారు. అంత నిడివి ఉంటే ఎక్కువ షోలు ప్రదర్శించే అవకాశం ఉండదు. వసూళ్ళు తగ్గుతాయని సలహా ఇచ్చారు. యానిమల్ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సందీప్ రెడ్డి వంగ నిడివి తగ్గించేందుకు ఒప్పుకోలేదు. అలానే విడుదల చేశారు. అయినప్పటికీ జనాలు ఎగబడి చూశారు. ఆ చిత్రం రూ. 900 కోట్ల వసూళ్ళు రాబట్టింది.
కాగా పుష్ప 2 మూవీ సైతం భారీ నిడివితో విడుదల అవుతుంది. పుష్ప 2 మూవీ రన్ టైం ఏకంగా 3:15 గంటలు అట. రెండు భాగాలుగా తెరకెక్కించినా కూడా ఇంకా ఇంత కథ ఉందా అనే సందేహం కలుగుతుంది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథను సుదీర్ఘంగా చెప్పనున్నాడని అర్థం అవుతుంది. అయితే అధిక రన్ టైం తో మూవీ విడుదల చేయడం ప్లస్ తో పాటు మైనస్ కూడా ఉంటుంది. అత్యధిక షోలు ప్రదర్శించుకునే వీలుండదు. అలాగే బలంగా కంటెంట్ ఉన్నప్పుడే ప్రేక్షకుడు విసుగు ఫీల్ కాకుండా మూవీ చూస్తాడు.
ఇటీవల విడుదలైన కంగువా మూవీ పరాజయానికి రన్ టైం కూడా కారణమైంది. అనంతరం ట్రిమ్డ్ వెర్షన్ వదిలారు. మరి పుష్ప 2 విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి స్పెషల్ షోలు ప్రదర్శిస్తారని టాక్. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, ఓపెనింగ్స్ రూపంలో గట్టిగా రాబట్టాలని ట్రై చేస్తున్నారు.