ట్రెండింగ్ టాపిక్స్ పై ఖచ్చితంగా స్పందిస్తారు రామ్ గోపాల్ వర్మ. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా ఉంది. ఈ చిత్ర ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఫస్ట్ డే పుష్ప 2 వరల్డ్ వైడ్ రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో సమానంగా హిందీలో ఈ చిత్రానికి రెస్పాన్స్ రావడం విశేషం. రూ. 72 కోట్ల వసూళ్లతో పుష్ప 2.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ పేరిట ఉన్న అత్యధిక ఫస్ట్ డే వసూళ్ల రికార్డును బ్రేక్ చేసింది. రెండు రోజుల్లో పుష్ప 2 హిందీ రూ. 130 కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. వరల్డ్ వైడ్ ఈ ఫిగర్ రూ. 400 కోట్లను దాటేసింది.
ఇదిలా ఉండగా… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుష్ప 2 చిత్రాన్ని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ… ఇండియాలో బలమైన పాత్రలు ఉన్న చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. వాటిలో పుష్ప 2 ఒకటి. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒక స్టార్ హీరో పుష్ప లాంటి పాత్ర ఊపుకోవడం గొప్ప. సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవితంలో పుష్ప లాంటి వ్యక్తులు ఉంటారని నాకు అనిపించింది. కమర్షియల్ హంగులున్న చిత్రంలో అలాంటి పాత్ర చేయడం సాహసమే. పుష్ప పాత్ర అనేది అనేక వైరుధ్యాలతో కూడుకుని ఉన్నది. అమాయకత్వం తో పాటు ఎదుటువారిని మోసం చేసే తెలివితేటలు, తారా స్థాయిలో ఉండే అహం… ఈ పాత్రలో మనం చూడొచ్చు.
వైకల్యం కలిగిన వ్యక్తి సూపర్ హీరో అవుతాడని అనుకోరు. సూపర్ హీరో పాత్రలకు ఉండే నిర్వచనం వేరు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ సూపర్ హీరో పాత్రలకు సరికొత్త నిర్వచనం ఇచ్చాడు.మునుపెన్నడూ లేని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రలో మనం చూడొచ్చు. సినిమా చరిత్రలో, దశాబ్దాల పాటు ప్రేక్షకుల మదిలో పుష్ప సినిమా ఉండిపోతుంది. తన అహం దెబ్బతినే సన్నివేశాల అనంతరం పుష్ప బాధపడే సీన్స్ లో అల్లు అర్జున్ ప్రాణం పెట్టి నటించాడు. చెప్పాలంటే పుష్ప పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా సరిపోడు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి.. అని అన్నారు.