నవరసాలకు రంగులు అద్ది రసవేదాన్ని రసవాదాన్ని పంచిన దర్శకేంద్రుడు ఆయన, పువ్వులను పండ్లును వెండితెరకెక్కించి రసిక హృదయాలను రంజింపజేసిన కళాఖండాల దర్శక అఖండుడు ఆయన. తెలుగు చలనచిత్ర రంగ చరిత్రలో దాదాపు అర్ధశతాబ్దం పాటు తన ప్రభావాన్ని చూపించిన ఏకైక దర్శక దిగ్గజం ఆయన. ఆయన గురించి చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పాలి. ఆయన గురించి అర్ధం చేసుకోవాలి అంటే.. తెలుగు సినిమాల రికార్డులను అవార్డులను అవపోసన పట్టాలి.
ఆయనే దర్శకేంద్రుడు. నేటి తరం ‘ఆదర్శ’కేంద్రుడు. పూర్తి పేరు కె. రాఘవేంద్రరావు, అంటే .. కోవెలమూడి రాఘవేంద్రరావు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. తెలుగు కమర్షియల్ సినిమా పుట్టిన రోజు. సినిమా రంగంలో సినీ చరిత్రకారులు చాలామంది ఉంటారు, కానీ సినీ చరిత్రకారులందరికి అతీతమైన వ్యక్తి రాఘవేంద్రరావు. ఎందుకంటే ఆయన చేయని నేపథ్యం లేదు, ఆయన చూపని వైవిధ్యం లేదు, ఆయన చెప్పని కథాంశం లేదు, అన్నిటికి మించి ఆయనలా సుదీర్ఘ ప్రయాణం ఎవ్వరికీ లేదు.
ప్రేక్షకుల పై పాటల రూపంలో ఆయన వేసే ఇంద్రజాలం, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆయన చేసే మంత్రజాలం అద్భుతం. అందుకే ఆయన ఏమి చేసినా ప్రేక్షక లోకం ఆస్వాదించింది. అనుభూతి చెందింది. ఒక్కో సారి హద్దులు మీరిన స్వాగతించింది. ఆయనను దీవించింది. అందుకేనేమో తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులను నేర్పిన ఘనత కూడా ఆయనకే దక్కింది. రక్తి, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ లతో పాటు భక్తి,లోనూ ఆయనను మించినోళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.
రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాశ్ రావు, ఆయన కూడా దర్శకుడే. చిన్నప్పటి నుండి సినిమా ప్రపంచంలోనే రాఘవేంద్రరావు పుట్టి పెరిగారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళు పాటు రాఘవేంద్రరావు శిష్యరికం చేసి, దర్శకత్వంలో ఎన్నో విషయాలను అర్ధం చేసుకున్నారు. అయితే రాఘవేంద్రరావు సినీ ప్రయాణం అంత తేలిగ్గా ఏమి సాగలేదు. మొదటి అవకాశం కోసం ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు. పరాజయం ఎదురైనా మళ్ళీ కసితో పని చేసి విజయాల పరంపరను కొనసాగించారు.
అందుకే, కేవలం నాలుగున్నర దశాబ్దాల కాలంలోనే 108 తెలుగు చిత్రాలకు, 18 పరభాషా భాషా చిత్రాలకు దర్శకత్వం వహించి మేటి అనిపించుకున్నారు. పైగా ఒక జాతీయ అవార్డు, 10 నంది పురస్కారాలు. 2 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుని తనకు తానే సాటిగా భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పోయే విశిష్టతను సాధించగలిగారు. ఆయనకు జీవన సాఫల్య పురస్కారం లభించినా.. నేటికీ నిత్య విద్యార్థిగానే ఆయన ప్రస్థానం కొనసాగుతుంది.
ఇక ఆయనకు మాత్రమే సాధ్యమైన రికార్డులలో ఒకటి ఐదు తరాల స్టార్లతో కలసి పనిచేయడం. ఎన్టీఆర్ కి రాఘవేంద్రరావు వీరాభిమాని. అందుకే, అరవై ఏళ్ల వయసులో కూడా అన్నగారిని అందాల రాముడిగా చూపించగలిగారు. అతి తక్కువ కాలంలో ఏకంగా ఎన్టీఆర్‌తో 12 సినిమాలు చేయగలిగారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నుండి నాగార్జున వరకు, కృష్ణ నుండి మహేశ్ బాబు వరకు, చిరంజీవి నుండి అల్లు అర్జున్ వరకు ఇలా అందరి హీరోలకీ సూపర్ హిట్స్ ఇచ్చిన ఖ్యాతి కూడా దర్శకేంద్రుడికే దక్కుతుంది.
శివ.కె