
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అద్భుతమైన నటనతో అలరించి, మెప్పించారు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన అకాల మరణం టాలీవుడ్ కు తీరని లోటుగానే మిగిలిపోయిందని చెప్పాలి. బాలీవుడ్ సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురవడం.. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ విషాద సంఘటన సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ శ్రీహరితో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.
శ్రీహరి-ఎన్.శంకర్ కాంబినేషన్లో ‘భద్రాచలం’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. శ్రీహరి కెరీర్లో ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలో థైక్వాండో ఫైటర్ గా కనిపించారు శ్రీహరి. అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయంలో శ్రీహరి భార్య శాంతి.. దర్శకుడు శంకర్ పై శాపనార్థాలు పెట్టేదట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు శంకర్.
శ్రీహరి మొదట్లో కామెడీ విలన్ తరహా పాత్రలు పోషించేవారు. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘హలో బ్రదర్’లో శ్రీహరికి తానే అవకాశం ఇప్పించినట్టు శంకర్ చెప్పారు. అప్పటి నుంచి తమ బంధం కొనసాగుతూనే వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు భద్రాచలం సినిమా తీసినట్టు తెలిపారు. అయితే.. ఆ సినిమా షూటింగ్ లో శ్రీహరి ఎన్నో రిస్కీ షాట్లు చేశారని తెలిపారు.
‘‘ఒకటే జననం.. ఒకటే మరణం..’’ పాటలో శ్రీహరిని తలకిందులుగా వేళాడదీసి వ్యాయామం చేయించడం వంటి కఠిన సన్నివేశాలు ఉన్నాయి. శ్రీహరి మొండివాడు కావడంతోనే ఇలాంటి సీన్లు తీయడం సాధ్యమైందని శంకర్ తెలిపారు. ఈ సన్నివేశాలను చూసి తన భర్తను చంపేస్తావా? అని అన్నారట శాంతి. అంతేకాదు.. ఈ సినిమా ఆడుతుందన్న నమ్మకాన్ని కూడా శాంతి వ్యక్తం చేయలేదట.
కానీ.. భద్రాచలం సినిమా మాత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రానికి రావాల్సిన అవార్డుల విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని శంకర్ అన్నారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో నంది అవార్డు కమిటీలో పనిచేసినట్టు చెప్పిన శంకర్.. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూశానని చెప్పారు.