Raja Saab movie : రెబల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో విడుదలకు దగ్గరగా ఉన్న చిత్రం ‘రాజా సాబ్’. డైరెక్టర్ మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది. అయితే ఈ చిత్రం వాయిదా పడిందంటూ సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా ఒక ప్రచారం వైరల్ అయ్యింది. ఈ ప్రచారం మేకర్స్ వరకు చేరడంతో వాళ్ళు వెంటనే స్పందించి ‘సోషల్ మీడియా లో ప్రసారమయ్యే వార్తలను నమ్మకండి. మూవీ టీం మొత్తం రేయింబవళ్లు పని చేస్తున్నారు. చెప్పిన డేట్ కి వస్తున్నాం. ఏదైనా మేము చెప్తేనే నమ్మండి, బయట వాళ్ళు చెప్పేవి నమ్మకండి’ అంటూ ఒక లేఖని విడుదల చేసారు.
దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రభాస్ రేంజ్ కి తగిన సినిమా కాదని అభిమానులు ఈ చిత్రం మొదలైన రోజు నుండి సోషల్ మీడియా లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ద్వారా మేకర్స్ చెప్పకనే చెప్పారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ, అందనంత ఎత్తులో ఉన్న ప్రభాస్, మారుతీ లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో పని చేయడం ఏమిటి అనేది ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఈ సినిమా ప్రభాస్ చేయడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి ఈ కథ విజయ్ దేవరకొండ కోసం సిద్ధం చేసుకున్నాడట డైరెక్టర్ మారుతీ. అతనికి త్వరలో ఈ కథని వినిపించేందుకు సిద్దమయ్యాడట. కానీ ఇంతలోపే యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుండి మారుతీ కి కాల్ వచ్చింది.
నీ దగ్గర ఒక కామెడీ హారర్ స్టోరీ ఉందంట కదా, గోపి (గోపీచంద్) చెప్పాడు, ఆ కథ మాకు వినిపించు, నచ్చితే ప్రభాస్ తో ఈ సినిమా మనం చేస్తున్నాం అని అన్నాడట ప్రభాస్ సోదరుడు ప్రబోధ్. మారుతీ ఎంచుకున్న కాన్సెప్ట్ ప్రబోధ్ కి తెగ నచ్చేసింది. కాన్సెప్ట్ బాగుంది కానీ, ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ మార్పులు చేర్పులు చేసి తీసుకొనిరా, ఒకరోజు ప్రభాస్ కి ఫైనల్ న్యారేషన్ ఇద్దాము అని అన్నాడట. అలా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే చేద్దాం అనుకున్నారట. కానీ ప్రభాస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ కి తదుపరి చిత్రం చేస్తానని మాట ఇచ్చాడట. దీంతో యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతుల్లో పెట్టింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు మేకర్స్.