Mahi V Raghav: అది క్విడ్ ప్రో కాదంటున్న యాత్ర 2 దర్శకుడు మహీ వి రాఘవ

తాజాగా ఏపీ సీఎం జగన్ జీవిత కథను ఇతివృత్తంగా చేసుకొని యాత్ర 2 సినిమాను మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల ముంగిట రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ చిత్రం వెనుక ఉన్న కథను ఎల్లో మీడియా బయటపెట్టింది.

Written By: Dharma, Updated On : February 14, 2024 4:29 pm

Mahi V Raghav

Follow us on

Mahi V Raghav: రాజకీయ,సినీ రంగాలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రెండు రంగాల వారికి పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. సినీ ఆకర్షణ ఎన్నికల్లో రాజకీయ నాయకులకు పనికొస్తుంది. అధికారంలోకి వచ్చాక రాజకీయ నేతల సహకారం సినీ రంగానికి ఉంటుంది. దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. దేశంలో పేరు మోసిన స్టూడియోల నిర్మాణం వెనుక రాజకీయ సహకారం తప్పనిసరి. టిడిపి ప్రభుత్వం సహకారం లేకుండా రామోజీ ఫిలిం సిటీ రూపొందేదా? విశాఖలో రామానాయుడు స్టూడియో నిర్మాణం జరిగేదా? సినీ రంగ ప్రముఖులకు భూకేటాయింపులు వెనుక కచ్చితంగా రాజకీయ సహకారం ఉంటుంది.ఇది జగమెరిగిన సత్యం కూడా.తాజాగా మహి వి రాఘవ విషయంలో జరిగింది ఇదే. క్విడ్ ప్రో అని ఎల్లో మీడియా.. లేదు రాయలసీమలో సినీ అభివృద్ధి కోసమని దర్శకుడు మహీ వి రాఘవ చెబుతున్నారు.

తాజాగా ఏపీ సీఎం జగన్ జీవిత కథను ఇతివృత్తంగా చేసుకొని యాత్ర 2 సినిమాను మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల ముంగిట రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ చిత్రం వెనుక ఉన్న కథను ఎల్లో మీడియా బయటపెట్టింది. జగన్ తో మహీ వి రాఘవ బంధం ఈనాటిది కాదని.. గత ఎన్నికలకు ముందు జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం రాఘవ పని చేశారని.. ఒక్క యాత్ర సినిమా కాదు.. జగన్ పాదయాత్రలో పలికిన డైలాగులన్నీ మహీ వి రాఘవ రాసినవేనని ఎల్లో మీడియా వరుస కథనాలు రాసింది.అయితే అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. కానీ మహివీ రాఘవ విన్నపం మేరకు జగన్ సర్కార్ రెండు ఎకరాల భూమిని కేటాయించిందంటూ ప్రత్యేక కథనం రావడం పెను దుమారానికి కారణమైంది.

మదనపల్లిలోని హర్షిలి హిల్స్ లో మినీ స్టూడియో నిర్మాణానికి 10 ఎకరాల భూమి కావాలని మహీవి రాఘవ దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. నేరుగా సీఎంవో నుంచే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లడంతో ఫైల్ చకచకా కదిలింది. దీంతో ఆయనకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎల్లో మీడియా సమగ్ర కథనం రాసింది. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణను పట్టించుకోని జగన్ సర్కార్.. తమకు రాజకీయ ప్రయోజనం కల్పించిన మహివీ రాఘవకు భూమి కేటాయించడంపై పెద్ద వివాదం నడిచింది. అయితే దీనిపై మహీ వీ రాఘవ ఘాటుగా స్పందించారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కుట్రగా అభివర్ణించారు. తాను 16 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నానని.. చాలా చిత్రాలకు దర్శకత్వం వహించానని.. రాయలసీమ ప్రాంతంలో సినీ పరిశ్రమ విస్తరణకు మాత్రమే తాను భూమి కేటాయించాలని అడిగానని… తాను వందల ఎకరాలు కోరుకోలేదని.. కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టేడియం నిర్మాణానికి మాత్రమే భూమి కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో రాయలసీమకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో బాధపడుతూ మినీ స్టూడియో నిర్మాణానికి సంకల్పించినట్లు చెప్పుకొచ్చారు. కానీ తాను క్విడ్ ప్రో కు పాల్పడ్డానని రచ్చ రచ్చ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాలపై తాను బాధపడేది లేదని, భయపడేది లేదని తేల్చి చెప్పారు.