AP Cabinet meeting : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు అవుతోంది. పాలన ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అమరావతి రాజధాని నిర్మాణం పట్టాలెక్కింది.ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి.మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ ముమ్మరంగా సాగుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. ఇంకోవైపు సంక్షేమ పథకాల అమలుపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది.సాధారణంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులర్ బడ్జెట్ను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం మూడు నెలలపాటు ఓటాన్ బడ్జెట్ వైపు మొగ్గు చూపింది. ఆదాయ వ్యయాలను ఒక అంచనాకు వచ్చి..సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరోవైపు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేందుకు నేడు మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేయనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని క్యాబినెట్ రద్దు చేయనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 12 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందులో కీలకమైన వాలంటీర్ల కొనసాగింపు పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
* పేపర్ లెస్ క్యాబినెట్
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేపర్ లెస్ ఈ- క్యాబినెట్ ను అప్పట్లో టిడిపి ప్రభుత్వం నిర్వహించింది. అజెండా మొదలుకొని నోట్స్ వరకు ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు అందించారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించనున్నారు. అన్ని రకాల లావాదేవీలు ఆన్లైన్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ భేటీని సైతం పేపర్ లెస్ గా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు అమలు చేయనున్నారు.
* ఏకతాటిపైకి ఎక్సైజ్ శాఖ
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసింది. కేవలం ఎక్సైజ్ శాఖను షాపుల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖలో కొంతమంది సిబ్బందిని దానికి బదిలీ చేసింది. మద్యం, ఇసుకతో పాటు నిషేధిత వస్తువుల రవాణా నియంత్రణ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. అందుకే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చింది. దానిపై క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
* రివర్స్ టెండరింగ్ రద్దు
రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ప్రభుత్వం చేపట్టిన చాలా రకాల పనులను రద్దు చేసింది. 25 శాతం లోపు పనులను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త పనులు చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఆ పని చేయలేక పోయింది. రివర్స్ టెండరింగ్ విధానంతో ఏపీకి నష్టం జరిగింది. అందుకే ఆ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
* సాగునీటి సంఘాలకు ఎన్నికలు
సాగునీటి సంఘాల ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలు చాలా యాక్టివ్ గా పని చేశాయి. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్లుగా విభజించి వాటికి నీటి సంఘాలను ఎంపిక చేశారు. రైతులతో సంఘాలను ఎన్నుకునే వారు. ఏటా ఖరీఫ్, రబీలో సాగునీటి సంఘాలు సాగునీటి వనరుల మరమ్మత్తుల్లో కీలక పాత్ర పోషించేవి. కానీ గత కొన్నేళ్లుగా వీటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో టిడిపి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సైతం క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసే అవకాశం ఉంది.
* వాలంటీర్ వ్యవస్థ పై నిర్ణయం
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అనే విషయం ఈరోజు తేలనుంది. ఇప్పటికే వలంటీర్లకు సంబంధించి ఒక శాఖను మంత్రికి అప్పగించారు. వాలంటీర్ల విషయంలో కొన్ని చేర్పులు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపైన క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వాలంటీర్ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.