Anil Ravipudi: ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam). గత పదేళ్లుగా ఏ వెంకటేష్ సినిమాకి లేనంత క్రేజ్ ఈ చిత్రానికి ఉంది. అందుకు ముఖ్య కారణాలలో ఒకటి అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకటి అయితే, మరొకటి ఈ చిత్రం లోని పాటలు. భీమ్స్ స్వరపర్చిన ప్రతీ పాట యూట్యూబ్ లో బాంబు లాగా పేలింది. ముఖ్యంగా రమణ గోగుల(Ramana Gogula) పాడిన ‘గోదారి గట్టు మీద రామచిలకవే'(godari gattu) అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్ లో 77 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. త్వరలోనే వంద మిలియన్ మార్కుని కూడా అందుకోనుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.
ట్రైలర్ చూసేందుకు చాలా ఆసక్తి గా ఉంది కానీ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎక్కడో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ వచ్చింది. అయితే నిన్న ఈ ట్రైలర్ ని ఒక ఈవెంట్ ద్వారా విడుదల చేసారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘దిల్ రాజు గారితో నాకు ఇది ఆరవ సినిమా. ఈ ప్రయాణం లో దిల్ రాజు, శిరీష్ లతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. సినిమా కోసం నేను ఏది కావాలని కోరినా కాదు అనకుండా ఇచ్చేవాడు దిల్ రాజు. మొన్ననే ఈ సినిమా ఫైనల్ కాపీ ని చూసుకున్నాం. చాలా బాగా వచ్చింది. వెంకటేష్ గారి కెరీర్ లోనే భారీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రం గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో వెంకటేష్ గారి భార్య గా నటించిన ఐశ్వర్య రాజేష్ ఆయన్ని చాలా టార్చర్ చేసింది. ఇంగ్లీష్ పదాలు వాడితే చాలు, వెంకటేష్ గారికి వాతలు వచ్చేలా కొడుతుంది. ఇక మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె కెరీర్ లో ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. కామెడీ చేసింది, యాక్షన్ అదరగొట్టింది. వెంకటేష్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సినిమా కోసం ఏదైనా చేస్తారు. ఆయన కెరీర్ లో ఎన్నో సంచలనాత్మక పాత్రలు ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉండబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ గానే జరిగింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 33 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.