Director Sujeeth: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల్లో సరికొత్త ఉత్సహాన్ని నింపిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సుజిత్(Sujeeth) దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు నుండే టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోయింది. వంద కోట్ల షేర్ సినిమా లేదని గతంలో పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చేవి. కానీ ఈ చిత్రం వంద కోట్ల షేర్ కాదు, ఏకంగా 190 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో నిలిచిపోయింది. కాంతారా చిత్రం పోటీకి రాకపొయ్యుంటే కచ్చితంగా ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయినప్పటికీ కూడా డివైడ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. విషయం లోకి వెళ్తే ఈ సినిమా నిర్మాతకు, డైరెక్టర్ సుజిత్ కి చిన్న పాటి మనస్పర్థలు ఏర్పడ్డాయని. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు డైరెక్టర్ సుజిత్ కి అవసరమయ్యే బడ్జెట్ ని ఇవ్వలేదని, కనీసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎడిటింగ్ రూమ్ కూడా బుక్ చేయకపోవడం తో, తన ఫ్లాట్ లోనే సుజిత్ ఈ సినిమాని ఎడిట్ చేసాడని, చివరి రోజుల్లో ప్యాచ్ వర్క్ కోసం తన సొంత డబ్బులు 6 కోట్లు ఖర్చు చేసాడని, అందుకోసం తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన కారుని కూడా అమ్మేయాల్సి వచ్చిందని, ఇలా ఎన్ని రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. ఈ వార్తలు సుజిత్ వరకు చేరడం తో ఆయన వెంటనే స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా ఒక లేఖని విడుదల చేసాడు.
నిర్మాత దానయ్య గారు మాకు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి అందించిన సహాయసహకారాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన తోడ్పాటు లేకుంటే ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు, అభిమానులు జీవితాంతం గుర్తించుకునే సినిమా అయ్యేది కాదు, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే పిచ్చి వార్తలను నమ్మకండి అంటూ సుజిత్ ఒక లేఖని విడుదల చేసాడు. అయితే నిర్మాతతో ఎలాంటి విబేధాలు లేకపోతే, నాని సినిమా నుండి డీవీవీ దానయ్య ఎందుకు తప్పుకున్నాడు?, అంతే కాకుండా ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ చిత్రాలను ఎందుకు ఇతర ప్రొడక్షన్ హ్యాండిల్ నిర్మించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి?, కచ్చితంగా ఎదో తేడా జరిగింది అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.