Dhurandhar: ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం కారణంగా కళకళలాడుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 560 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ ఈ చిత్రానికే వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో గా నటించిన రణవీర్ సింగ్(Ranveer Singh), విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) లకు వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. 3 గంటల 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాని ఎక్కడా కూడా నిమిషం బోర్ కొట్టకుండా తెరకెక్కించడం లో డైరెక్టర్ ఆదిత్య దళ్ మరోసారి తన ప్రతిభ ని చాటుకున్నాడు. గతం లో ఆయన ఆర్టికల్ 370 , URI సర్జికల్ స్ట్రైక్ వంటి చిత్రాలను ఆయన రూపొందించాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఆదిత్య వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని , పాకిస్థాన్ కి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాపై పాకిస్థాన్ తో పాటు, మిడిల్ ఈస్ట్ లోని దేశాలు కూడా రుసరుసలాడాయి. ఫలితంగా అక్కడ విడుదలకు కూడా ఈ చిత్రం నోచుకోలేదు. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్న ఈ చిత్రం పై ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఈ సినిమా ఒక పాకిస్తానీ సినిమాకు కాపీ అని అంటున్నారు. ఇండియన్స్ మా సినిమాని కాపీ కొట్టి, మాపైనే సెటైర్లు వేస్తున్నారు అంటూ పాకిస్తాన్ కి చెందిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 వ సంవత్సరం లో వచ్చిన ‘అస్లాం చౌదరి’ అనే పాకిస్థానీ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని ఈ దురంధర్ చిత్రాన్ని రూపొందించారని ఆ చిత్రం లో నటించిన ఖమర్ రెజా చెప్పుకొచ్చాడు.
అస్లామ్ అనే వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్. 2014 వ సంవత్సరం లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆయన మరణించాడు. ఆయన జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన పాకిస్థానీ చిత్రం ‘అస్లామ్ చౌదరి’ ని ఆధారంగా తీసుకొని ఈ ‘దురంధర్’ చిత్రాన్ని రూపొందించినట్టు రెజా ఆరోపించాడు. ‘దురంధర్’ చిత్రం లో అస్లామ్ క్యారక్టర్ ని సంజయ్ దత్ పోషించి అద్భుతమైన మార్కులను ఆడియన్స్ నుండి కొట్టేసాడు. అయితే అసలే బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాగా దూసుకుపోతున్న ఈ చిత్రానికి, ఇలాంటి వివాదాలు నిప్పు మీద పోసిన పెట్రోల్ లాంటిది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్ల మార్కుని అందుకునేలా అనిపిస్తోంది.