చెన్నైలోని పోయెస్ గార్డెన్ ఏరియా అంటేనే ధనవంతుల అడ్డా. చెన్నైలోనే అతి ఖరీదైన ప్రాంతమది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. అలాగే పెద్ద పెద్ద హీరోలు, రాజకీయ నాయకులు ఈ ఏరియాలోనే ఉంటున్నారు. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ ఏరియాలో ఎవరూ 150 కోట్ల రూపాయలు పెట్టి భారీ ఇంటిని ఇంతవరకు నిర్మించుకోలేదు, రజినీకాంత్ తో సహా.
కానీ ధనుష్ మాత్రం అల్ట్రా మోడ్రన్ వసతులతో, కళ్ళు చెదిరే ఆర్కిటెక్చర్ తో ఏ హీరోకి లేని విధంగా తన ఇంటిని భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ ఇల్లు పూర్తి కానుందని తెలుస్తోంది. తన తండ్రి రజినీకి దగ్గరగా ఉండాలనేది ధనుష్ భార్య ఐశ్వర్య కోరిక అట. తన భార్య కోరిక తీర్చడానికి ధనుష్ 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారీ భవనాన్ని కట్టిస్తున్నాడు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ధనుష్ ఈ ఇంటికి అవుతున్న ఖర్చు కోసమే తెలుగులో భారీ రెమ్యునరేషన్ లను డిమాండ్ చేస్తూ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడని రూమర్ కూడా వినిపిస్తోంది. తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తే.. తెలుగులో స్టార్ హీరో సినిమాకి ఉన్న మార్కెట్ దక్కుతుంది. ఇక తమిళంలో ఎలాగూ తానూ స్టార్ కాబట్టి, అక్కడ తన సినిమాకి ఫుల్ మార్కెట్ అవుతుంది.
అంటే ఒక సినిమాకి రెండు మార్కెట్లు అన్నమాట. అందుకే ధనుష్ తెలుగు డైరెక్ట్ సినిమాల పై పడ్డాడు. తెలుగులో ఇప్పటికే శేఖర్ కమ్ముల సినిమాకి ధనుష్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే మరో తెలుగు సినిమాకి కూడా ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.