DSP vs Thaman : ఒక్కోతరంలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు చిత్ర పరిశ్రమను శాసించారు. పాత తరాన్ని వదిలేస్తే ఇళయరాజా, రాజ్-కోటీ,కీరవాణి, మణిశర్మ టాలీవుడ్ ని సుదీర్ఘ కాలం ఏలారు. మణిశర్మ డౌన్ అయ్యాక దేవిశ్రీ ఆయన స్థానం భర్తీ చేశారు. ఇక దేవిశ్రీకి థమన్ పోటీ ఇస్తున్నారు. కాగా 2020 సంక్రాంతి సమరం చాలా ఆసక్తికరంగా మారింది. మహేష్-అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ, అల వైకుంఠపురంలో చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు.
ఈ రెండు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్స్ పరంగా అల వైకుంఠపురంలో చిత్రం పై చేయి సాధించింది. మ్యూజిక్ పరంగా థమన్ తన సీనియర్ దేవిశ్రీని వెనక్కినెట్టాడు. అల వైకుంఠపురంలో ఆల్బమ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సినిమా విజయంలో థమన్ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. యూట్యూబ్ లో అల వైకుంఠపురంలో సాంగ్స్ సంచలన రికార్డ్స్ నమోదు చేశాయి. కోట్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. 2020 సంక్రాంతి రేసులో విన్నర్ థమన్ అనేది క్లియర్ గా అర్థమైంది.
అదే పరిస్థితి మరో మూడేళ్ళ తర్వాత వచ్చింది. 2023 సంక్రాంతి బరిలో దేవిశ్రీ-థమన్ పోటీపడుతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రానికి థమన్ మ్యూజిక్ కొడుతున్నారు. దీంతో వీరిద్దరి పోరు మరోసారి రసవత్తరంగా మారింది. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ నిన్న విడుదలైంది. ఐటెం సాంగ్ ‘బాస్ పార్టీ’ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. దేవిశ్రీ మాస్ బీట్ కేక అంటున్నారు.
కాగా వీరసింహారెడ్డి చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ నవంబర్ 25న విడుదల కానుంది. బాస్ పార్టీ సాంగ్ తో దేవిశ్రీ థమన్ కి గట్టి సవాల్ విసిరారు. ఇక వీర సింహారెడ్డి ఫస్ట్ సింగిల్ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది వారిద్దరి మధ్య ఫస్ట్ రౌండ్ మాత్రమే. విన్నర్ ఎవరో తెలియాలంటే రెండు చిత్రాల టోటల్ సాంగ్స్ విడుదల కావాలి. సినిమాల ఫలితాలు తెలియాలి. ఏది ఏమైనా టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తేల్చుకోవాల్సిన ఒత్తిడి వారిద్దరిపై ఇప్పుడు ఉంది.