ఇప్పటికీ సినీ కార్మికులు చెప్పే మాట ఒక్కటే, దాసరిగారి లాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మరలా తమ జీవితాల్లో తారసపడలేదు అని. ఎందరో వయసు అయిపోయిన సినీ కార్మికులకు దాసరి షాప్ లు పెట్టించారు, వాళ్ళ పిల్లలను పై చదువులు చదివించారు. కొంతమంది వృద్దులకు పక్కా ఇల్లలు కట్టించి ఇచ్చారు. సినీ పరిశ్రమతో సంబంధం లేని వారికీ ఈ విషయాలు తెలియకపోవచ్చు.
కానీ ఫిల్మ్ నగర్ బస్తీలోకి వెళ్లి, అక్కడ కనిపించే ప్రతి సినీ కార్మికుడి గడపలోకి వెళ్ళి చూస్తే గుమ్మంకి ఎదురుగా దాసరిగారి ఫోటో ఉంటుంది. వారిందరికీ ఆయన సాయం చేశారు అని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏమి కావాలి. అందుకే దాసరి లాంటి మహోన్నతమైన వ్యక్తి అతి అరుదుగా కనిపిస్తారు. ఎప్పటికీ ప్రతి సినిమా వ్యక్తి అంగీకరించే మాట ఇది, దాసరి లేని లోటు సినీ పరిశ్రమకి తీరని లోటే.
ఇక దాసరి రికార్డ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. ఒక రచయితగా, ఒక నిర్మాతగా,అన్నిటికి మించి పెద్ద దర్శకుడిగా ఎన్నో ఎన్నెన్నో సంచలన విజయాలు సాధించిన ఏకైక దిగ్గజ దర్శకుడు దాసరి. అలాగే దర్శకుల విలువను పెంచిన దిగ్దర్శకుడు దాసరి. గిన్నిస్ పుటలకెక్కినా, ప్రతి సంక్షోభంలోనూ సినీ కార్మికుల పక్షాన నిలిచినా అది ఒక్క ‘డా. దాసరి నారాయణరావు’కే చెల్లింది.
మన హృదయాల్లో శాశ్వతంగా ఆయన సజీవంగా నిలిచే ఉంటారు. నేడు టీవీల్లో ఆయన విజువల్స్ మీద ఆయన గురించి రెండు ముక్కలు మంచి మాటలు చెప్పేసి రేపటికి మర్చిపోవచ్చు. కానీ దాసరి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ఆ సినిమాలు ఉన్నంత వరకూ ఆ దిగ్దర్శకుడి ఆత్మ తెలుగు సినిమాలకు రక్షణగానే ఉంటుంది.