Daku Maharaj : నందమూరి బలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఈ నెల 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గురువారం అనంతపురం లో భారీ రేంజ్ లో నిర్వహించేందుకు మూవీ టీం సిద్ధమైంది. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడని అధికారిక ప్రకటన కూడా చేసారు. భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యే ఈవెంట్ కాబోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా దురదృష్టం కొద్దీ తిరుపతి లో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటన ని పురస్కరించుకొని ఇలాంటి కష్ట సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం కరెక్ట్ కాదని భావించి ఈ ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్టుగా మూవీ టీం కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది.
దురదృష్టకరమైన సంఘటన జరగడంతో అభిమానులు కూడా అర్థం చేసుకొని సర్దుకున్నారు. ఈమధ్య కాలం లో ఎందుకో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంధ్య థియేటర్ ఘటన యావత్తు తెలుగు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేలా చేసింది. ఇక ఆ తర్వాత ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి ఇంటికి తిరిగి వెళ్తూ ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ గా తిరుపతి లో ఇలాంటి ఘటన జరగడం మరో దురదృష్టకరమైన వార్త. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. గడిచిన రెండు దశాబ్దాలలో తిరుమల తిరుపతి దేవస్థానం లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సంక్రాంతికి విడుదల కాబోతున్న కొత్త సినిమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని మందలించింది. రేపు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.
అర్థరాత్రి 1 గంట నుండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోస్ మొదలు కానున్నాయి. దీనికి థియేటర్స్ వద్ద భారీ బందోబస్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకు బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ చిత్రం విడుదల కానుంది. దీనికి కూడా పటిష్టమైన పోలీస్ భద్రతని ఏర్పాటు చేయనున్నారు. బాలయ్య హీరో గా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. డల్లాస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపించిన మూవీ టీం, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దురదృష్టకర సంఘటనల వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. రిపీట్ గా జరుగుతున్న ఇలాంటి ఘటనలు కారణంగా భవిష్యత్తులో జన సమీకరణ ఉండే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండకపోవచ్చు. కేవలం ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో మాత్రమే జరుపుకునే అవకాశాలు ఉన్నాయి.