Daaku Maharaaj: మరో వారం రోజుల్లో సంక్రాంతి సందడి మొదలు కాబోతుంది. సంక్రాంతి అంటే మనకి ఎన్నో గుర్తుకు వస్తాయి. వాటిలో సినిమా కూడా ఒక అంతర్భాగమే. కుటుంబ సమేతంగా సంక్రాంతి సెలవుల్లో సినిమాలు చూసేందుకు జనాలు అమితంగా ఇష్టపడుతుంటారు. ఈ సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసేందుకు ‘గేమ్ చేంజర్’ చిత్రం తో పాటుగా బాలయ్య ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ భయారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఆ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’,’భగవంత్ కేసరి’ వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కంటే ఎక్కువ జరిగిందని అంటున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి ఆంధ్ర ప్రాంతం లో 47 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, ‘డాకు మహారాజ్’ చిత్రానికి ఏకంగా 53 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో ఉండడంతో పాటు, సంక్రాంతి పండుగ సీజన్ ఆంధ్ర ప్రాంతం మొత్తం టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వస్తాయి అనే ఉద్దేశ్యంతోనే బయ్యర్స్ దేవర చిత్రం కంటే భారీ రేట్స్ పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారని విశ్లేషకులు చెప్తున్నారు. బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రం ఇదే సంక్రాంతి సీజన్ లో విడుదలై 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇప్పుడు ‘డాకు మహారాజ్’ చిత్రానికి టాక్ వస్తే కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకుంటుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ పండితులు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని టాక్. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే 20 నిమిషాల సన్నివేశం తో పాటు, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్ లో వచ్చాయని, బాలయ్య గత మూడు చిత్రాలకంటే ఈ సినిమానే ది బెస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ నెల నాల్గవ తేదీన ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని డల్లాస్ లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఆ ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏమిటి అనేది అభిమానులకు ఒక అంచనా వస్తుందని, నందమూరి అభిమానులు సంబరాలకు సిద్ధమవ్వాలి అంటూ మేకర్స్ ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు.