Pawan Kalyan : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడిపిన సంగతి మన అందరికీ తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలను ప్రారంభించి దాదాపుగా 50 శాతం కి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసాడు. ఆ తర్వాత ఎన్నికలు ముంచుకొస్తుండడం తో ఈ సినిమాల షూటింగ్స్ అన్నిటిని ఆపి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. జనాల్లో విస్తృతంగా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాత్రి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే సగం పూర్తి చేసిన సినిమాలను ఎలా అయినా వంద శాతం పూర్తి చేయాలి కదా. అందుకే ఇప్పుడు అన్ని సినిమాలకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేసాడు. నిన్ననే ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని విజయవాడ లో వేసిన భారీ సెట్స్ లో ప్రారంభించాడు.
ఈ సందర్భంగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసారు. కానీ మార్చి 27 వ తారీఖున నిర్మాత దివీవీ దానయ్య ‘ఓజీ’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా పోస్టర్ మీద విడుదల తేదీ వేయించుకొని మరీ పెట్టుకున్నాడట. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ఈ పోస్టర్ ని విడుదల చేద్దామని అనుకున్నారట. కానీ ఆ సమయం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం చేయడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏది కూడా ఇవ్వొద్దు అని నిర్మాతలకు చెప్పాడట. దీంతో ఓజీ మేకర్స్ ఆగిపోయారు. ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నం ఎలా అయిన ఆ చిత్రాన్ని ఓజీ కి ముందే విడుదల చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడట. అందుకే విడుదల ఓజీ మేకర్స్ కంటే ముందే విడుదల తేదీని ప్రకటించారు. ‘హరి హర వీరమల్లు’ టీం ఇలా చేయడం పై ‘ఓజీ’ మేకర్స్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే ‘హరి హర వీరమల్లు’ మేకర్స్ కి ‘ఓజీ’ ని మార్చి 27 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనే విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ‘హరి హర వీరమల్లు’ ఆ డేట్ కి ప్రకటించడం చాలా అన్యాయం అని ‘ఓజీ’ మేకర్స్ వాపోతున్నారట. దీనిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము అని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందితో ‘ఓజీ’ మేకర్స్ అన్నట్టు తెలుస్తుంది. అలా పవన్ కళ్యాణ్ నిర్మాతల మధ్య ఇప్పుడు అంతర్యుద్ధం మొదలైంది. రెండు సినిమాలకు పవన్ కళ్యాణ్ నుండి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే అవసరం ఉంది. రెండు కూడా ఒకే సమయం లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిలీజ్ డేట్స్ విషయం లో సరైన నిర్ణయం తీసుకోలేక నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు.