TTD Laddu Contravorsy : తిరుపతి లడ్డు వివాదం సీరియల్ ఎపిసోడ్ లా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వివాదం ఉంది. ముఖ్యంగా వైసిపి కార్నర్ అవుతోంది. ఆ ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని ఆరోపణలు రావడం.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. తొలుత లడ్డు వివాదాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించగా.. డిప్యూటీ సీఎం పవన్ పతాక స్థాయికి తీసుకెళ్లారు. హిందూ ధర్మానికి విఘాతం కలుగుతోందని.. సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ప్రతిరోజు ఏదో ఒకచోట ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. వైసిపి తో పాటు సీఎం జగన్ ను ఇరుకున పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో ఈ అంశం రోజురోజుకు సీరియస్ గా మారుతోంది. ఎక్కడికక్కడే హిందువులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
* హిందూ ధార్మిక సంస్థల పోరాట బాట
దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంస్థలు దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. పీఠాధిపతులతో పాటు స్వామీజీలు తప్పు పడుతూ నిరసనబాటపడుతున్నారు. రామజన్మభూమి ట్రస్ట్ ప్రతినిధి స్పందించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ చర్యలను ఖండించారు. స్వామీజీలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు కొనసాగుతుండగా.. ఇంకోవైపు హిందూ కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. దీంతో రోజురోజుకు ఈ సమస్య జఠిలం అవుతోంది.
* చంద్రబాబు ట్విట్ వైరల్
ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై మరోసారి స్పందించారు. తిరుమలను అపవిత్రం చేశారని మరోసారి వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో సీఎం జగన్ తిరుమలను సందర్శించినప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. సాధారణంగా తిరుమలకు ఇష్టపూర్వకంగా వెళ్లే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన అన్య మతస్తుడైన అప్పటి సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ అప్పట్లో ఆ అవసరం లేదన్నట్టు వ్యవహరించారు. సీఎం హోదాలో వెళితే డిక్లరేషన్ ఇవ్వడం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు దానినే ప్రస్తావించారు చంద్రబాబు. ఈరోజు సోషల్ మీడియాలో చంద్రబాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
* ముప్పేట దాడి
అయితే జగన్ పై ముప్పేట దాడి పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకోవైపు రోజుకో అస్త్రంతో చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది హిందువుల మనసులో వైసీపీపై చెడు అభిప్రాయం ఏర్పడుతోంది. దీనిపై వైసీపీ కౌంటర్ అటాక్ చేసిన ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా జగన్ అష్టదిగ్బంధంలో బంధించారు చంద్రబాబు. ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.