కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభించిందో మాటల్లో చెప్పలేం. ఈ దెబ్బకు అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అన్నింటికన్నా ఎక్కువ దెబ్బతిన్న ఇండస్ట్రీల్లో.. చిత్ర పరిశ్రమ ముందు వరసలోనే ఉంటుంది. తొలిదశలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ లో మాత్రం.. సినీ పరిశ్రమే స్వయంగా షటర్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. కొవిడ్ వేగంగా విస్తరించడం.. థియేటర్లకు రావడానికి జనాలు తీవ్రంగా భయపడడంతో టాకీసులన్నీ వెలవెలబోయాయి. దీంతో.. అనివార్యంగా మూసేసింది థియేటర్స్ అసోసియేషన్. ఆ తర్వాత షూటింగులకు సైతం ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది.
ఆ విధంగా.. వరుసగా రెండో ఏడాది కూడా సమ్మర్ సీజన్ ను మింగేసింది కరోనా. అయితే.. రెండో దశ నుంచి సినీరంగం త్వరగానే కోలుకునే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నెల 1 నుంచే సినిమా థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుండడంతో.. పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు సుమారు రెండున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల గడిస్తే.. ఆ మొత్తం మరింతగా తగ్గుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఇండస్ట్రీ.
ఇదే జరిగితే జులై ఆరంభం నుంచే థియేటర్లు తెరుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే.. 50 శాతం ఆక్యుపెన్సీనా? 100 శాతమా? అనే సమస్య కూడా ఉంది. తెలంగాణలో కేసుల తీవ్రత తక్కువగా ఉన్నందున వందశాతం కెపాసిటీతో థియేటర్లు తెరుచుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఏపీలో కేసులు కాస్త ఎక్కువగానే ఉన్నందున 50 శాతం సీటింగ్ తో రన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అయితే.. సీటింగ్ కెపాసిటీ ఎలా ఉన్నా.. సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట ప్రొడ్యూసర్స్. వకీల్ సాబ్ తర్వాత రావాల్సిన సినిమాలన్నీ వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవన్నీ వరుసగా రాబోతున్నట్టు సమాచారం. లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం వంటి ప్రాజెక్టులతోపాటు మిగిలిన చిన్న చిన్న సినిమాలు కూడా స్లాట్లు బుక్ చేసుకుంటున్నాయి. ఇలా దాదాపు 10 నుంచి 12 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
థియేటర్ల అంచనాలు అలా ఉంటే.. షూటింగులు మాత్రం ఈ నెలలోనే ప్రారంభించాలని చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికే చాలా సినిమాలు చాలా కాలంగా సెట్స్ పై ఉండడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. అందువల్ల సాధ్యమైనంత త్వరగా షూటింగులు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే ఇండస్ట్రీ ఈ సారి త్వరగా కోలుకున్నట్టే లెక్క. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.