స్టార్ హీరోలందరూ పది నెలలు ముందుగానే తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించేశారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలు మాత్రం ఇంకా రిలీజ్ డేట్స్ ను ప్రకటించలేదు. ఏ డేట్ బెటర్ అని మెగాస్టార్ టీమ్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. పక్కాగా లెక్కలు వేసుకున్నాకే ముఖ్యంగా ఏ సినిమా పోటీ లేని సమయంలోనే విడుదల తేదీని ప్రకటించాలని మెగా టీమ్ ప్లాన్ చేస్తోంది.
అయితే, తాజా అప్ డేట్ ప్రకారం మరో మూడు రోజుల్లో ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తారట. ఆచార్య సినిమా షూటింగ్ చివర్లో ఉంది. కొన్ని సీన్స్ కి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. మరో ఆరు రోజుల వర్క్ తో ఈ సినిమాకి ప్యాకప్ చెబుతారు. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. సంక్రాంతి సీజన్ లో ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు ఫిక్స్ అయిపోయాయి.
ఇక దసరాకి ఇండియాలోనే అతిపెద్ద మూవీ “ఆర్ఆర్ఆర్” రెడీగా ఉంది. క్రిస్మస్ కి అల్లు అర్జున్ “పుష్ప”, మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్ 2” పోటీకి సై అంటున్నాయి. మరి ఈ లెక్కన “ఆచార్య”కి సరైన డేట్ ఎప్పుడు దొరుకుతుందనేది పెద్ద డౌట్. అయినా ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రకటించిన డేట్స్ అన్ని తాత్కాలికమే అనుకోవాలి.
కరోనా మూడో వేవ్ ముదిరితే, మళ్ళీ అన్ని సినిమాల విడుదల తేదీలు తారుమారు అయిపోతాయి. ఇక ఆచార్య సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయట. ముఖ్యంగా చిరు – చరణ్ కాంబినేషన్ అదిరిపోతోందట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.