Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత అందుకున్నారు. ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. రికార్డు స్థాయిలో ఆయన వేసిన స్టెప్పులకు ఈ గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఇప్పటి వరకు చిరంజీవి 156 సినిమాలు చేశారు. 537 పాటల్లో నృత్యం చేశారు. అలాగే చిరంజీవి 24 డాన్స్ మూమెంట్స్ ప్రదర్శించారు. ఈ అరుదైన ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి పేరు నమోదు చేశారు.
చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు, చిత్ర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో చిరంజీవి కొంచెం నలతగా కనిపించారు. ఆయన నడిచేందుకు కూడా కష్టపడ్డారు. సాయి ధరమ్ తేజ్ చిరంజీవి చేయి పట్టుకుని వేదిక వద్దకు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో యాంకర్ ఓ విషయం బయటపెట్టింది. చిరంజీవి గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని అన్నారు. ఈ కామెంట్స్ చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. వారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గెట్ వెల్ సూన్ మెగాస్టార్ చిరంజీవి అంటూ పోస్ట్స్ పెడుతున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
మరోవైపు విశ్వంభర విడుదల తేదీ సమీపిస్తోంది. చిరంజీవి షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా విశ్వంభర 2025 జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న సమాచారం నిరాశకు గురి చేస్తుంది.
విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకుడు. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టు. ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.