Chiranjeevi pawan kalyan: తూర్పు గోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పర్యటించనుండడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు పర్యటన పెట్టుకున్నారు? అసలు కథ ఏంటనేది ఉత్కంఠగా మారింది. శుక్రవారం రాజమండ్రికి వస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. శనివారం పవన్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాల్లో వీరిద్దరి పర్యటన చర్చనీయాంశమైంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ పర్యటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అభిమానులు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలకు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వస్తున్నట్టు సమాచారం. ఆస్పత్రి ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విగ్రహావిష్కరణ చేస్తున్నారు. దీనికి మెగా ఫ్యామిలీ హాజరుకాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.
ఇక చిరంజీవి టూర్ ముగిసిన మరునాడే శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అక్టోబర్ 2న రాజమండ్రిలోనే పవన్ పర్యటించనున్నారు. రోడ్ల శ్రమదానంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్ కు పవన్ వస్తున్నారు. రోడ్ల దుస్థితి పరిశీలించి శ్రమదానం చేయనున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ రాక సందర్భంగా ఇప్పటికే జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత కల్పించాలని కోరారు. అటు పవన్ శ్రమదానం నేపథ్యంలో జనసైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనాలని చూస్తున్నారు. పవన్ టూర్ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఒకరోజు తేడాతో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సందడి నెలకొంది. మెగా ఫ్యాన్స్ లో జోష్ నెలకొంది. చిరంజీవి ఫ్యామిలీ ప్రోగ్రాంలో పాల్గొంటుడగా.. పవన్ మాత్రం రాజకీయ ప్రోగ్రాంలో ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు.