Chiranjeevi: దర్శకుడు కృష్ణవంశీకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ తో కృష్ణవంశీ సినిమా చేయకపోయినా.. కృష్ణవంశీ చేసే ప్రతి సినిమా కథ చిరుకు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కృష్ణవంశీ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘రంగమార్తాండ’ కథను కూడా చిరంజీవికి చెప్పారు. అయితే, ఈ కథలో పాత్రల పరిచయం చాలా కీలకం. ఈ పరిచయాలను కృష్ణవంశీ తన వాయిస్ తోనే లేక రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతనో చెప్పించాలి అనుకున్నారు.

అయితే, ‘రంగమార్తాండ’ కథ విన్న చిరంజీవి కృష్ణవంశీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. ‘నీ కోసం ఆ పాత్రల పరిచయ వాయిస్ నేను ఇస్తాను’ అని మాట ఇచ్చారు. ఇదంతా కరోనా కాలానికి ముందు జరిగింది. ఈ మధ్యలో ఎన్నో జరిగాయి. పైగా మధ్యలో కృష్ణవంశీ మెగాస్టార్ తో టచ్ లో లేరు. మరోపక్క తన సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ చేశారు. డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు.

చిరంజీవి ఇచ్చిన మాట కృష్ణవంశీకి గుర్తు ఉంది. కానీ, వెళ్లి అడగాలి అంటే మొహమాటం. స్వతహాగా ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న మనిషి కృష్ణవంశీ. అందుకే చిరంజీవికి ‘రంగమార్తాండ’ డబ్బింగ్ గురించి చెప్పలేదు. అయితే, ఓ మేనేజర్ ద్వారా శబ్దాలయ స్టూడియోలో ‘రంగమార్తాండ’ డబ్బింగ్ జరుగుతుంది అని చిరంజీవికి తెలిసింది. వెంటనే..స్టూడియోకి వచ్చారు.
కృష్ణవంశీని పిలిచి మందలించారు. ‘మాట ఇచ్చాను కదా, పిలవాలి కదా’ అంటూ సీరియస్ అయ్యారు. ఇక తానే కలగజేసుకుని ఈ సినిమాలో పాత్రల పరిచయానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సాయంత్రం ఈ సినిమా వాయిస్ ఓవర్ మొత్తం పూర్తి చేశారు. ఏది ఏమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చిరు చేసిన పనికి కృష్ణవంశీ షాక్ అయి అలాగే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడట.

గతంలో మెగాస్టార్ చిరంజీవి – కృష్ణవంశీ కాంబినేషన్ లో‘వందేమాతరం’ అనే సినిమాని అనుకున్నా.. ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేకపోయింది. అయినా వీరిద్దరి మధ్య అనుబంధం మాత్రం అలాగే ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ అంటే చిరుకు నమ్మకం. ఇక ‘రంగమార్తాండ’ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్నారు.