దాసరి తర్వాత చిత్ర పరిశ్రమ బాధ్యతలు భుజానికెత్తుకునేందుకు ప్రయత్నిస్తున్న మెగాస్టార్.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. తొలి దశ లాక్ డౌన్ తర్వాత షూటింగుల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడం నుంచి ఇతరత్రా పనుల విషయంలోనూ ముందు ఉంటున్నారు. ఇలాంటి చిరంజీవికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది. అదే.. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక.
త్వరలో ‘మా’ ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఏకగ్రీవంగా సాగే ఈ తంతు.. కొంత కాలంగా ఎన్నికలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఎన్నిక అనివార్యమవుతోంది. అయితే.. ఎన్నిక జరిగినా మెగా కాంపౌండ్ ఆశీస్సులు ఉన్నవారే విజయం సాధిస్తారనే ప్రచారం ఉంది. అయితే.. ఇప్పుడు బరిలో ఉన్నవారంతా కావాల్సిన వాళ్లే కావడంతో మెగాస్టార్ కు చిక్కొచ్చి పడింది.
ఈ సారి మా ఎన్నికల్లో ఒకవైపు ప్రకాష్ రాజ్, మరోవైపు మంచు విష్ణు నిలబడడం దాదాపు ఖాయమైంది. వీళ్లతోపాటుగా తానూ బరిలో ఉన్నానంటున్నాడు శివాజీ రాజా. ఈ ముగ్గురూ చిరంజీవికి దగ్గరివారే అనే ప్రచారం ఉంది. ప్రకాష్ రాజ్ మొదట్నుంచీ మెగా కాంపౌండ్ కు చెందిన వ్యక్తిగానే ఉన్నారు. గతంలో ఓ సారి ఇండస్ట్రీలోని పలువురు ఈయనను ‘బ్యాన్’చేయాలని భావించిన సమయంలోనూ.. చిరంజీవే నచ్చజెప్పారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ చిరుతో సన్నిహితంగానే ఉంటున్నారు.
ఇక, మంచు ఫ్యామిలీతో చిరు రిలేషన్ అందరికీ తెలిసిందే. కొంత కాలంగా రెండు కుటుంబాలూ మరింత దగ్గరయ్యాయి. ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా.. సకుటుంబ సపరివారంగా వెళ్లివస్తున్నారు. మోహన్ బాబు అప్ కమింగ్ మూవీ ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా అందించారు మెగాస్టార్. ఇలా వీళ్ల బంధం మరింతగా బలపడింది. అటు శివాజీరాజాకు గతంలో మెగాకాంపౌండ్ మద్దతు లభించింది. పోయినసారి ఇది లేకనే ఓడిపోయారనే ప్రచారం సాగింది. ఇప్పుడు.. మరోసారి బరిలోకి అంటున్నాడు శివాజీ రాజా.
ఈ నేపథ్యంలో.. ఎవరికి మద్దతు ఇవ్వాలనేది చిరుకు ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివాజీరాజాకు ఏదో విధంగా నచ్చజెప్పొచ్చు. మరి, ప్రకాష్ రాజ్ – విష్ణు మధ్య పోరును ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అసలు.. ప్రకాష్ రాజ్ ముందుగా చిరు అంగీకారం పొందిన తర్వాతే బరిలోకి దిగారనే ప్రచార ఉంది. మరి, ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ ఎవరికి మద్దతు ఇస్తారు? ఈ సమస్య నుంచి సేఫ్ గా ఎలా బయటపడతారు? అన్నది చూడాలి.