
కరోనా బారిన పడిన దేశం మళ్లీ గాడిన పడింది. అన్ని రంగాలూ తమపని తాము చేసుకుంటున్నాయి. కానీ.. సినీ రంగం మాత్రం ఇంకా పట్టాలెక్కిందే లేదు. నానా అవస్థలూ.. అష్టకష్టాలూ పడుతోంది. అయితే.. తెలంగాణలో మాత్రం పూర్తి అనుకూల వాతావరణమే ఉంది. ఇక్కడ థియేటర్లు తెరుచుకున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీ ఉంది. అంతేకాదు.. కరోనా నేపథ్యంలో జరిగిన నష్టానికి గానూ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రితో జరిగిన చర్చల్లో.. విద్యుత్ బకాయిల మాఫీ విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి.
కానీ.. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. జగన్ సర్కారు నుంచి తగిన ప్రోత్సాహం లభించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిదశ కరోనా సమయంలో నామమాత్రంగా కరెంటు బిల్లులు మాఫీ చేసిన జగన్ సర్కారు.. ఆ తర్వాత పట్టించుకోవట్లదని సినీవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు షోలకే అనుమతి ఉంది. నైట్ షో రద్దు చేశారు. అందులోనూ.. 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అమల్లో ఉంది.
ఇది కాకుండా.. మరో అతిపెద్ద సమస్య టిక్కెట్ రేట్ల తగ్గింపు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సమయంలో సర్కారు ఉన్నట్టుండి రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న ఏపీ సర్కారుకు.. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందే.. సినిమా టిక్కెట్ల విషయం గుర్తుకు వచ్చింది. దీంతో.. రాత్రికి రాత్రే సినిమా టిక్కెట్ల ధరలు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జీవో కూడా జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా.. ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దంటూ ఆ జీవోలో ఆదేశించింది. ఈ నిర్ణయం.. వకీల్ సాబ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది.
సహజంగా పెద్ద హీరోల చిత్రాలు ఏవి రిలీజ్ అయినా.. బెనిఫిట్ షోలు వేయడం సర్వ సాధారణం. మొదటి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవడం కూడా ఎప్పుడూ జరిగేదే. ఈ మేరకు ప్రభుత్వాలే జీవో ఇచ్చాయి. కానీ.. జగన్ సర్కారు ఉన్నట్టుండి రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేయడం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఆ జీవో ప్రకారం.. మల్టీఫ్లెక్స్ లలో, కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రీమియం టికెట్ ధర రూ.250 మాత్రమే ఉండాలి. మిగిలిన టిక్కెట్లు రూ.150, 100 మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్లలో ఏసీ ఉంటే వంద, లేదంటే రూ.60 మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఈ జీవో ఇండస్ట్రీకి పెనుశాపంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దలు సమావేశం కాబోతున్నారు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం నుంచే ఆహ్వానం రావడం గమనార్హం. మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి.. ముఖ్యమంత్రితో సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో.. త్వరలో ఈ భేటీ జరగనుంది. మరి, ప్రభుత్వంతో ఏం మాట్లాడుతారు? సర్కారు ఎలా ఆదుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానమైనది టికెట్ రేట్ల పెంపు. ఈ విషయంలో జగన్ మెట్టు దిగుతారా? అన్నది కీలకంగా మారింది. ఇక్కడ సర్కారుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు పరిశీలకులు. రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వకపోతే.. ఈ భేటీ వల్ల ఒరిగేది ఏమీ లేనట్టే. అలా కాకుండా.. ధరల పెంపునకు ఇప్పుడు అంగీకరిస్తే మాత్రం.. అప్పుడు ఉద్దేశపూర్వకంగానే పవర్ స్టార్ ను దెబ్బ తీసేందుకే టికెట్ రేట్లు తగ్గించారనే విమర్శలు వస్తాయి. అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు తప్పవు.