ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దళితబంధు పథకం అమలులో వేగం కనిపించడం లేదు. దీంతో దళితుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. పథకం ప్రారంభంలో ఐదు వేల మందికి వారి ఖాతాల్లో పది లక్షలు పడతాయని చెప్పినా అది ఆచరణలో కనిపించే దాఖలాలు కనిపించడం లేదు. రేపు హుజురాబాద్ లో ప్రారంభమయ్యే పథకంలో కేవలం 15 మందికి మాత్రమే చెక్కులు అందజేస్తారని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. దీంతో పథకం అమలుపై ఇప్పటికే దళితుల్లో నిరాశ కలుగుతోంది. ఇప్పటికే అందరికి దళితబంధు పథకం అమలు చేస్తామని ప్రకటించినా ఆచరణలో మాత్రం ఆ చొరవ కానరావడం లేదు.
ఇప్పటికే ఐదు వేల మందికి నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ చెబుతున్నా కేవలం పదిహేను మందికే చెక్కులు అందజేయడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో దళితబంధు పథకం అమలుపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం నియోజకవర్గంలో సుమారు 21 వేల మంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో పది లక్షల నిధులు పడతాయని భరోసా ఇచ్చారు. దీంతో వారంతా ఊహల డోలికల్లో ఊయలలూగుతున్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు కేవలం 15 మందికే చెక్కులు ఇస్తారని ప్రకటించడంతో దళితుల్లో ఆందోళన నెలకొంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పథకం అందరికీ చేరాలంటే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపించడంతో ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. హుజురాబాద్ లో దళితులకు అందరికి రూ. 10 లక్షల చొప్పున అందాలంటే రూ.2 వేల కోట్లు కావాలని భావించి మొదటగా రూ.500 కోట్లు కేటాయించినా అవి కూడా పంపిణీ చేయడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోంది.
దళితబంధు అమలుపై దళితుల్లో పెరుగుతున్న నిరాశతో టీఆర్ఎస్ కు సమస్యలే ఎక్కువగా వచ్చేలా ఉన్నాయి. అందరికి పది లక్షలు అందజేస్తామని చెబుతున్నా ఆచరణలో కనిపించకపోవడంతో అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశించిన లాభం ఒనగూరే మార్గం కనిపించడం లేదు. దీనిపై పార్టీ వర్గాల్లో కూడా అనేక చిక్కులు వస్తున్నాయి.