రచయిత, నటుడు సి.ఎస్.రావు(85) మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. సి.ఎస్.రావు సుప్రసిద్ధ సీనీ, నవలా, నటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ మూవీకి సీఎన్.రావు కథను అందించారు. ఆయన రచయితగానే కాకుండా పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోపాటు ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’, జాతీయ అవార్డు చిత్రం ‘ఊరుమ్మడి బతుకులు’, ‘నాయకుడు వినాయకుడు’, ‘మల్లెమొగ్గలు’ వంటి పలు చిత్రాలకు సి.ఎస్.రావు కథలు అందించారు. అదేవిధంగా ఎన్టీఆర్ తో కలిసి ‘సరదా రాముడు’, ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రాల్లో ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు.
అలాగే సి.ఎస్.రావు నాటక రంగానికి చేసిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సి.ఎస్.రావుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్డౌన్ నిబంధనల వల్ల ఎవరూ పరామర్శకు రావద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. బుధవారం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.