Pushpa 2: హీరో అల్లు అర్జున్ ఫేమ్ పూర్తిగా మార్చేసింది పుష్ప. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రైమ్ డ్రామా నార్త్ లో అల్లు అర్జున్ ని స్టార్ చేసింది. హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. వరల్డ్ వైడ్ పుష్ప రూ. 360 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ క్రమంలో పుష్ప 2 భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇటీవల మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. నెక్స్ట్ థాయిలాండ్ లో ఓ భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
పుష్ప 2 షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేశారని 2024 సమ్మర్ లో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఒక దశలో 2023 డిసెంబర్ లోనే పుష్ప 2 రావొచ్చన్నారు. పార్ట్ 1 చిత్రీకరణ సమయంలో పార్ట్ 2 షూటింగ్ కూడా జరిగిందనే వాదన ఉంది. అయితే తాజా సమాచారం షాక్ ఇస్తుంది. పుష్ప 2 కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే జరిగిందట. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
సుకుమార్ మరలా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారట. నెక్స్ట్ షెడ్యూల్ కి వెళ్లబోయే ముందు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ కాకుండా కొన్ని మార్పులు చేశాడట. ఈ క్రమంలో పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కి కూడా కష్టమే అంటున్నారు. అందుకే సుకుమార్, అల్లు అర్జున్ ఎలాంటి ప్రకటన చేయడం లేదట. షూటింగ్ పూర్తి అయ్యాక అప్పుడు విడుదల తేదీ మీద స్పష్టత వస్తుందట.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. వారు మరో ఏడాది కాలం పుష్ప 2 కోసం ఎదురు చూడాల్సిందే. పుష్ప 2 బడ్జెట్ కి రూ. 300 కోట్ల వరకు కేటాయించారని సమాచారం. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా చేస్తున్నాడు. అనసూయ మరో కీలక రోల్ చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప 2పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.