Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్… తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తోన్న పేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 లో విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ట్రోఫీని అందుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తుందన్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ ముగిసిన తరువాత రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కారుతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కార్లపై దాడులు జరిగాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులమంటూ కొన్ని అల్లరి మూకలు దుర్భాషలాడుతూ కార్లపై విరుచుకుపడ్డారు. అయితే కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ కు ఇంత సీన్ ఉందా? అభిమానులమంటూ దాడులకు పాల్పడే అంతగా ఆయనకు ఫాలోయింగ్ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరి మదిలో మెదలుతుందని తెలుస్తోంది.
యూట్యూబర్ గా పల్లవి ప్రశాంత్ తన కెరీర్ ను ప్రారంభించారన్న సంగతి తెలిసిందే. వ్యవసాయం పద్ధతులతో పాటు రైతు కష్టాలపై పలు వీడియోలను నెటిజన్లతో పంచుకుంటూ రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ పేరుగాంచారు. ఈ క్రమంలోనే కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తనదైన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకున్నారు. దాంతో పాటు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దీంతో ఆయన ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిందని చెప్పుకోవచ్చు.
బిగ్ బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తరువాత అభిమానుల మధ్య జరిగిన రచ్చ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ కార్లతో పాటు అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడులు చేశారు. అంతేకాదు అటు అమర్ దీప్ ఫ్యాన్స్, ఇటు పల్లవి ప్రశాంత్ అభిమానులు పరస్పరం దాడులు చేసుకుంటూ బూతులతో రెచ్చిపోయారు. అంతేకాకుండా అటుగా వెళ్లే సాధారణ ప్రజల వాహనాలపై కూడా దాడికి దిగారు. అభిమానం పేరుతో చేసినా ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలోనే వీళ్ల రచ్చను కంట్రోల్ చేయడానికి రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై కూడా కేసులు నమోదు చేశారు.