
Box Office: ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా టాలీవుడ్ తుస్సుమనిపించింది. దీపావళి కానుకగా మూడు చిత్రాలు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలు కలెక్షన్స్ రాబట్టలేక చేతులెత్తేశాయి. అదేంటో దీపావళి అంటే చాలు.. ఇక హిట్ టాక్ మాత్రం ఆ సీజన్ లో అసలు వినిపించదు. ఇది ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అందుకే దీపావళికి వచ్చే సినిమాలు పెద్దగా ఆడవు అని ఇండస్ట్రీలో బలంగా ఓ ప్రచారం సినీ జనంలో బాగా నాటుకుపోయింది.
అందుకే దీపావళి బ్యాడ్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆ సీజన్ కి పెద్ద హీరోలు ఎవ్వరూ తమ సినిమాలను ఆ సమయంలో రిలీజ్ చేయాలని అనుకోరు. ఇక ఈ ఏడాదీ జరిగిన దీపావళి బ్యాడ్ టైమ్ ను, ముఖ్యంగా బాక్సాఫీస్ పరాభవాన్ని మరిపించడానికి ఈ వారం జోరుగా రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి.
అయితే, ఈ వారం సినిమాల్లో ఓ విశేషం ఉంది. విచిత్రంగా రెండు సినిమాలకు పాత సినిమా టైటిల్స్ నే పెట్టారు. పైగా రెండు సినిమాల కథలు కాస్త కొత్తగా ఉన్నాయి. దీనికితోడు రెండు సినిమాలు ఒకే రోజున బాక్సాఫీసు దగ్గర గట్టిగా ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఆ రెండు సినిమాల సంగతికి వస్తే.. మొదటి సినిమా ‘రాజా విక్రమార్క’, ఇక రెండో సినిమా ‘పుష్షక విమానం’.
వరుస ప్లాప్ లతో బాధ పడుతున్న కార్తికేయ హీరోగా నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో చిరంజీవి ఒక సినిమా చేశాడు. చిరుకి కార్తికేయ ఫ్యాన్. ‘అందుకే నా సినిమాకు ఈ పేరు పెట్టుకున్నాను’ అంటూ కార్తికేయ ఓపెన్ గా చెప్పుకున్నాడు. కాకపోతే.. చిరు చేసిన అప్పటి ‘రాజా విక్రమార్క’ దారుణంగా ఫెయిల్ అయింది.
మరి ప్లాప్ సినిమా టైటిల్ తో కార్తికేయ ఎంతవరకు హిట్ కొట్టగలడు అనేది ఇప్పుడు పెద్ద డౌట్ ? దీనికితోడు ఈ సినిమాలో కార్తికేయ ఓ ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్రలు మాస్ ఆడియన్స్ కి ఎక్కవు.
ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘పుష్షక విమానం’ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. కమల్ హాసన్ చేసిన ఈ మూకీ సినిమాకు మంచి పేరు వచ్చింది. అదో క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. దాంతో అప్పట్లో ఆ సినిమాకు నష్టాలు వచ్చాయి.
మరి అలాంటి సినిమా టైటిల్ పెట్టుకుని ఆనంద్ సినిమా చేయడం సాహసమే. మరి పాత పేర్లతో కొత్తగా ఎంతవరకు హిట్ కొడతారో చూడాలి.