Sankranti Amanam : ప్రస్తుతం థియేటర్స్ లో విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాస్టింగ్ అవ్వడానికి ప్రధాన కారణం కచ్చితంగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడినే. కానీ వీళ్ళతో పాటు సరి సమానమైన క్రెడిట్స్ బుల్లి రాజు పాత్ర పోషించిన బుడ్డోడు రేవంత్ కి కూడా ఇవ్వాలి. ఫస్ట్ హాఫ్ లో ఈ బుడ్డోడు చేసిన కామెడీ కి ప్రేక్షకులు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. థియేటర్స్ కి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా ఈ సినిమా ఉందంటే అందుకు ప్రధాన కారణాలలో ఈ బుడ్డోడు కూడా ఒకడు. అయితే నేడు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని మూవీ టీం ఏర్పాటు చేసింది.
ఈ ఈవెంట్ కి హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి తో పాటు మూవీ టీం మొత్తం హాజరైంది. సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరూ ఎంతో సంతోషించి, ఆడియన్స్ కి కృతఙ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా బుల్లిరాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అతను మాట్లాడుతూ ‘అందరికీ నమస్తే.. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు. ఈ చిత్రంలో చూపించినట్టుగా, అందరూ నాలాగా ఓటీటీ లను చూసి చెడిపోకండి. ఎవరు నాలాగా తిట్టొద్దు, కేవలం ఫన్ కోసం ఇలా చేసాము అంతే, ఇలా అవుతుంది అనుకోలేదు, ఎవరికైనా తప్పుగా అనిపించి ఉంటే క్షమించండి’ అని అంటాడు. అప్పుడు యాంకర్ మేమంతా దానిని ఎంటర్టైన్మెంట్ గానే తీసుకున్నాము, నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది.
ఈ సక్సెస్ మీట్ లో నిర్మాతలలో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. మేము సమస్యల్లో పడ్డప్పుడు మా పని అయిపోయిందని చాలా మంది సంబరాలు చేసుకున్నారు, అది చూసి అనిల్ ఈ సినిమా మీ సమస్యలన్నీ తీర్చేస్తుంది సార్ అన్నాడు, అతను చెప్పినట్టుగానే జరిగింది అంటూ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల క్రితం ఇదే బ్యానర్ నుండి ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకొని భారీ నష్టాలను చూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ‘గేమ్ చేంజర్’ నష్టాలు పూడింది. కేవలం మొదటి వారం లోనే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.