Balagam Movie Effect: బలగం సినిమా ద్వారా విడిపోయిన వారంతా కలిసి పోయారు.. ఇన్నాళ్లపాటు విడిపోయినందుకు.. దూరంగా ఉన్నందుకు.. మాటలు మాట్లాడుకునేందుకు కంటనీరు పెట్టుకున్నారు. గుండెలకు హత్తుకొని ఆ బాధను మొత్తం మర్చిపోయేంతవరకు ఏడ్చారు.. బలగం సినిమా దర్శకుడు వేణుకు.. నిర్మాత రాజుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా చూస్తున్నంత సేపు అలానే ఏడ్చారు. ముఖ్యంగా పిట్టకు పెట్టే సన్నివేశంలోనైతే పూర్తిగా లీనమైపోయి.. ఆ భావోద్వేగాన్ని కళ్ళల్లో పలికించారు. బలగం సినిమా.. చిన్న సినిమా గా విడుదలై.. కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని అందుకుంది. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకుల ఆదరణ కచ్చితంగా ఉంటుందని నిరూపించింది. బలగం సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. ప్రాంతాలతో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక కుటుంబాలను ఆ సినిమా కలిపింది. ఇప్పుడు తాజాగా మరో కుటుంబాన్ని కూడా ఒకటి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది.
అన్నదమ్ములను కలిపింది
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనురు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సోదరులు. వీరిద్దరి మధ్య గత పది సంవత్సరాల క్రితం వివాదం ఏర్పడింది. దీంతో వారిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఈ రెండు కుటుంబాలు ఒకప్పుడు అన్యోన్యంగా ఉండేవి. బంధుత్వాలు బలంగా ఉండేవి. అనుకోకుండా ఏర్పడిన వివాదం రెండు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచింది.విభేదాలను పెంచింది. దీంతో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. శుభకార్యాలకు కూడా ఈ రెండు కుటుంబాల వారు ఒకరింటికి మరొకరు రావడం పూర్తిగా మానేశారు. ఇక ఇటీవల రామయ్య, నాగయ్య సోదరి కుమారుడు తిరుపతి (మేనల్లుడు) చనిపోయాడు. ఈ క్రమంలో అతడికి పిట్టకు పెట్టే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రామయ్య, నాగయ్య హాజరయ్యారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అయినప్పటికీ మాట్లాడుకోలేదు. ఇక ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన బంధువులు కలగజేసుకుని.. ఈ వయసులో పంతాలు ఎందుకని చెప్పడంతో.. ఇద్దరు సోదరులు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకున్నారు. తద్వారా గుండెలలో ఇన్ని రోజులపాటు గూడు కట్టుకున్న బాధను మొత్తం ఒక్కసారిగా బయటికి వెళ్లగక్కారు.
బలగం సినిమా ద్వారా తాము కలిసిపోయామని బంధువులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. వారిద్దరు పరస్పరం మాట్లాడుకుంటుండగా బంధువులలో కొంతమంది వీడియోలు తీశారు. ఈ దృశ్యాలను మొత్తం సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అవి సంచలనంగా మారాయి. కేవలం ఒక సినిమా ద్వారా 10 సంవత్సరాలపాటు దూరమైన ఇద్దరు అన్నదమ్ములు కలిసి పోవడం మామూలు విషయం కాదని కోలనూరు గ్రామస్తులు చెబుతున్నారు.