https://oktelugu.com/

బాక్సాఫీస్ 2021 : హిట్లు ఎన్ని ? ఫట్లు ఎన్ని ?

కరోనా మహమ్మారి విసిరిన పంజాకి బాక్సాఫీస్ వణికిపోయింది, సినిమాలు చెదిరిపోయాయి. షూటింగులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కానీ కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కొన్ని పెద్ద సినిమాలు తెలుగు బాక్సాఫీస్ కు జోష్‌ ను ఇచ్చాయి. అంతలోనే సెకెండ్ వేవ్.. ఆ ఆనందం కాస్త కన్నీళ్లమయం అయిపోయింది. ఎన్నో ఆశలు మళ్లీ మొదటికొచ్చాయి. థియేటర్ల మూసివేతతో ఓటీటీల బాట పట్టాయి కొన్ని సినిమాలు. మొత్తానికి ఈ ఏడాది ఎత్తుపల్లాల దారిలో సాగిన ఈ ప్రయాణంలో ఈ ఆరునెలల్లో టాలీవుడ్‌ […]

Written By: , Updated On : June 29, 2021 / 12:41 PM IST
Follow us on

Box Office 2021

కరోనా మహమ్మారి విసిరిన పంజాకి బాక్సాఫీస్ వణికిపోయింది, సినిమాలు చెదిరిపోయాయి. షూటింగులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కానీ కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కొన్ని పెద్ద సినిమాలు తెలుగు బాక్సాఫీస్ కు జోష్‌ ను ఇచ్చాయి. అంతలోనే సెకెండ్ వేవ్.. ఆ ఆనందం కాస్త కన్నీళ్లమయం అయిపోయింది. ఎన్నో ఆశలు మళ్లీ మొదటికొచ్చాయి. థియేటర్ల మూసివేతతో ఓటీటీల బాట పట్టాయి కొన్ని సినిమాలు. మొత్తానికి ఈ ఏడాది ఎత్తుపల్లాల దారిలో సాగిన ఈ ప్రయాణంలో ఈ ఆరునెలల్లో టాలీవుడ్‌ బాక్సాఫీస్ పరిస్థితి పై ఒక లుక్కేద్దాం.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రవితేజ ‘క్రాక్‌’ సూపర్ హిట్‌ గా నిలిచింది. అలాగే రామ్‌ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాలు కూడా బరిలో దిగాయి. వాటిలో ‘రెడ్‌’ పర్వాలేదనిపించుకుంది. ‘అల్లుడు అదుర్స్’ మాత్రం బెదరగొట్టింది. ఇక తమిళ హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ కూడా సంక్రాంతి పండక్కే వచ్చి బాగానే కలెక్షన్స్ ను రాబట్టింది. తెలుగు మార్కెట్ పై విజయ్ ఈ సినిమాతో మంచి పట్టు సాధించాడనే చెప్పాలి.

అలాగే జనవరిలోనే విడుదలైన అల్లరి నరేశ్‌ ‘బంగారు బుల్లోడు’ బాగా దెబ్బ కొట్టాడు. ఆ నిర్మాతకి బంగారం లేకుండా చేశాడు. యాంకర్ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా చేసిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాకు బ్యాడ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. ఇక స్టార్‌ హీరోల్లో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించింది పవన్‌ స్టార్ ఒక్కరే.

రీఎంట్రీ ఇస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ‘వకీల్‌ సాబ్‌’కు వసూళ్లు భారీగా వచ్చినా.. ఆ తర్వాత వారానికే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. అయితే ఈ సినిమాకి దాదాపు రూ.130 కోట్ల వరకూ గ్రాస్‌ వచ్చిందనే టాక్ ఉంది. ప్రశాంత్‌ వర్మ ‘జాంబి రెడ్డి’తో కొత్త తరహా వినోదాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించినా.. జస్ట్ ఓకే అనిపించుకుంది తప్ప, పెద్దగా ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత వచ్చిన ‘ఉప్పెన’ సముద్ర తీర ప్రేమ కథకు ఎమోషనల్ టచ్ ఇచ్చి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఉప్పెన ఏకంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది అంటే… ఇది సరికొత్త రికార్డే. హిట్ లేక డీలా పడ్డ అల్లరి నరేశ్‌ కి ‘నాంది’ అంటూ మంచి హిట్ వచ్చింది. కామెడీ వదిలేసి సీరియస్ ఖైదీగా కనిపించిన నరేశ్‌, కొత్తగా ఆకట్టుకుంటూ మొత్తానికి తనలో ఇంకా మ్యాటర్ ఉందని నిరూపించుకున్నాడు.

శర్వానంద్‌ ‘శ్రీకారం’ సినిమాకు ప్రశంసలు దక్కాయి కానీ వసూళ్లు మాత్రం రాలేదు. ‘రంగ్‌దే’ వసూళ్లు వచ్చాయి కానీ, ప్రశంసలు మాత్రం దక్కలేదు. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ విష్ణును దారుణంగా మోసం చేసింది. రూ. 50 కోట్లతో తెరకెక్కితే గట్టిగా పది కోట్లు కూడా రాలేదు. రాణా ‘అరణ్య’ ప్రయోగం కూడా దారుణంగా బెడిసికొట్టింది. మళ్ళీ తెలుగు బాక్సాఫీస్ నష్టాల్లో కూరుకుపోతుంది అనుకున్న సమయంలో వచ్చారు జాతిరత్నాలు.

పూర్తిస్థాయి హాస్యభరితమైన సంఘటనలతో నవ్వుల సునామీలో ముంచెత్తిన జాతిరత్నాలు వసూళ్లతో బాక్సాఫీస్‌ కు మళ్ళీ బలం పోశారు. భారీ సినిమాకి వచ్చే వసూళ్లును గుర్తుకు తెస్తూ మునుపటి కళను తీసుకొచ్చారు జాతిరత్నాలు. నాలుగు కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అంటే.. అది కామెడీకి ఉన్న గొప్పతనం.

ఈ ఏడాది వచ్చిన మరో చిన్న సినిమా ‘ప్లే బ్యాక్‌’. కంటెంట్ బాగున్నా మినిమమ్ కలెక్షన్లు కూడా లేవు. ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్‌ తో ఇంట్రెస్ట్ పెంచినా, సినిమాతో మాత్రం నీరసం తెప్పించింది. అనిల్‌ రావిపూడి హడావుడి చేసి నిర్మాతగా తీసిన ‘గాలి సంపత్‌’ అనిల్ పరువును తీసింది. చంద్రశేఖర్‌ యేలేటి, నితిన్‌ తో చేసిన ‘చెక్‌’ చంద్ర శేఖర్ నమ్మకానికి చెక్ పెట్టింది. సుమంత్‌ ‘కపటధారి’ ప్లాప్ అయి సుమంత్ నే చీట్ చేశాడు.

ఓటీటీల్లో వచ్చిన చిత్రాల విషయానికి వస్తే… గమ్మత్తైన యాసతో ‘సినిమా బండి’ అంటూ వచ్చిన నేచురల్ కామెడీ డ్రామా బాగా అలరించింది. బూతుకి హాస్యాన్ని జోడించి తీసిన ‘ఏక్‌ మినీ ప్రేమకథ’ బాగానే మెప్పించింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మెయిల్‌’ చాలా బాగుంది. ‘అర్ధ శతాబ్దం’ అంధ శతాబ్దంగా మిగిలింది.

అనువాద చిత్రాల విషయానికి వస్తే.. ‘మాస్టర్‌’ ఒక్కటే విజయవంతమైంది. అయితే మరో పెద్ద సినిమా ధనుష్‌ ‘జగమే తంత్రం’ భారీ అంచనాలతో నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదలైన ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టింది. ‘రాబర్ట్’‌, ‘పొగరు’, ‘యువరత్న’ సినిమాలకు ప్రేక్షకుల స్పందన తక్కువే. అందులో ‘మిడ్‌నైట్‌ మర్డర్స్’‌, ‘ట్రాన్స్‌’, ‘అనుకోని అతిథి’ కొంత మేర ఆకట్టుకున్నాయి.