Cannes Film Festival 2024: ‘ఫ్లీ మార్కెట్’ దుస్తులతోనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు అనసూయ.. అసలు ఏంటిది? దాని కథేంటి?

బెంగాళీ నటి అనసూయ సేన్ గుప్తాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి కేటగిరీలో భారతీయురాలు అవార్డు అందుకోవడం ఇదే మొదటి సారి.

Written By: Neelambaram, Updated On : May 29, 2024 11:38 am

Cannes Film Festival 2024

Follow us on

Cannes Film Festival 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన వాళ్లు అవార్డుల పంట పండిస్తున్నారు. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ దర్శకుడికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు రాగా.. బెంగాళీ నటి అనసూయ సేన్ గుప్తాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి కేటగిరీలో భారతీయురాలు అవార్డు అందుకోవడం ఇదే మొదటి సారి.

అవార్డు అనౌన్స్ నుంచే అనసూయ సేన్ గుప్తా క్రేజ్ భారత్ లో విపరీతంగా పెరిగింది. మే 28 (మంగళవారం) రోజు తన ఇన్ స్టాలో కృతజ్ఞత పోస్ట్ పెట్టారు. ఈ గ్రాండ్ ఈ వెంట్ కోసం తను ధరించిన దుస్తులు వాస్తవానికి ‘ఫ్లీ మార్కెట్’ (రోడ్డు మీద పెట్టి ధర తక్కువ, సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే దుకాణాలు) నుంచి కొనుగోలు చేసినట్లు అనసూయ చెప్పింది.

‘ది షేమ్ లెస్’ సినిమాలో రేణుక పాత్రలో అనసూయ అద్భుతంగా నటించి ఈ గౌరవాన్ని దక్కించుకుంది. అయితే ఆమె ఇన్ స్టా పోస్ట్ లో ఆమె తన దుస్తుల గురించి చెప్పి మరింత మంది ఫ్యాన్స్ ను పెంచుకుంది. ఫ్లీ మార్కెట్ నుంచి తన దుస్తులను కొనుగోలు చేసినట్లు నటి వెల్లడించింది. ‘ఫెస్టివల్ డికేన్స్’ మ్యాగజిన్ ఎడిషన్ లో తన జర్నీని వివరిస్తూ కేన్స్ అనుభవాలను పంచుకుంది.

ఇక ఇన్ స్టాలో తన పోస్ట్ నకు ‘థ్యాంక్యూ మై హార్ట్ ఈజ్ ఫుల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దుస్తులను అవార్డులకు ముందు కేన్స్ లోని ‘ఫ్లీ మార్కెట్’ నుంచి కొనుగోలు చేశాను, ఎందుకంటే నేను అలానే చేస్తుంటాను.’. అని రాసుకుంది.

ఇన్ స్టాలో మీరు చూస్తున్న ఫొటోల్లో మొదటి ఫ్రేమ్‌లో అనసూయ తెల్లని దుస్తులు ధరించి, బంగారు నగలు ధరించి అందాలను ఆరబోస్తూ కనిపించింది. మరో ఫోటోలో ఆమె తన సహనటుడు ఒమారా, దర్శకుడు కాన్స్టాంటిన్ బొజనోవ్ తో కలిసి ఫోజులిచ్చింది.

స్లైడ్ల మధ్య అనసూయ ఈ అవార్డు అందుకోవడం యొక్క గొప్ప ప్రాముఖ్యతను వివరిస్తూ, ‘77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకోవడం గౌరవంగా ఉంది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలిని నేనే కావడం, నా పేరు చరిత్రలో లిఖించడం మరింత ప్రత్యేకం. నా కృషిని గుర్తించినందుకు జ్యూరీ కళాకారులకు రుణపడి ఉంటాను. నా దృష్టిలో ఈ అవార్డు వ్యక్తిగత విజయం కంటే చాలా ఎక్కువ.’ అని చెప్పింది.

తనకు వచ్చిన గుర్తింపు భారతీయ చిత్ర పరిశ్రమలో మహిళలకు మరిన్ని అవకాశాలు, విజిబిలిటీకి మార్గం సుగమం చేస్తుందని, భవిష్యత్ తరాలు నిర్భయంగా తమ కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు.

ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సేన్ గుప్తా ప్రస్తుతం గోవాలో ఉంటోంది. నెట్ ఫ్లిక్స్ షో ‘మసాబా మసాబా’ సెట్ డిజైన్ కు ఆమె సహకారం అందించారు. కోల్ కత్తా కు చెందిన ఆమె జాదవ్పూర్ యూనివర్సిటీలో చదివారు.