Gandikota: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. గత ఏడాదిగా వర్షాల జాడలేదు. సమృద్ధిగా వర్షాలు కూడా పడలేదు. దీంతో గత ఏడాది ఖరీఫ్ దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది ఇంతవరకు వర్షాలు పలకరించడం లేదు. ఈనెల 30న కేరళ కు రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు పడితే గాని ప్రజలకు ఉపశమనం కలగదు. ముఖ్యంగా రాయలసీమలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. కరువు ఛాయలు అలుముకున్నాయి. చెరువులు, కాలువలు, నదులు ఎండిపోతూ కనిపిస్తున్నాయి. మండే ఎండలతో రాయలసీమ మండిపోతోంది.
వైయస్సార్ జిల్లా గండికోట పర్యాటక ప్రాంతానిది సుదీర్ఘ చరిత్ర. నిత్యం వేలాదిమంది సందర్శకులు గండికోటలో పర్యటిస్తుంటారు. అక్కడ ఉండే ఎర్రకోనేరు ఏడాది పొడవునా నీటితో తొణికిసలాడుతుంటుంది. అటువంటి చెరువు ఈ ఏడాది పూర్తిగా ఎండిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఈ కోనేరు సొంతం. తమ తాత ముత్తాతల నుంచి ఈ కోనేరు ఎండిపోవడం చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అటువంటి కోనేరు ఎండిపోవడంతో ఎటువంటి ఉపద్రవం వస్తుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది అధికంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జూన్ సమీపిస్తున్నా పెద్దగా వర్షాలు పడటం లేదు. ఏపీలో కొన్ని జిల్లాలకు వర్షపాతం లోటు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అది కూడా ఆందోళన కలిగించే విషయం. గతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడి వర్షాలు పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆకాశం దట్టమైన మేఘాలతో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ కొద్దిసేపటికి ఆ మేఘాలు కనుమరుగవుతున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. 900 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎండిపోని ఒక చెరువులో నీటి చుక్క కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.