Bollywood Sequels: సరైన విజయాలు లేక అల్లాడుతున్న బాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది. సౌత్ హిట్ చిత్రాలను సీక్వెల్స్ గా తెరకెక్కిస్తున్నారు. కథ, జానర్ తో కూడా సంబంధం లేకుండా తెరకెక్కుతున్న కొన్ని సీక్వెల్స్ ఆసక్తిరేపుతున్నాయి. ఆ కథేమిటో చూద్దాం..
Also Read: రెచ్చిపోయిన టిడిపి ఎమ్మెల్యే.. టీటీడీ సిబ్బందిపై నోటి దురుసు!
సాధారణంగా సీక్వెల్ అంటే… ఒక సినిమా కథకు కొనసాగింపు అని అర్థం. ఈ సీక్వెల్ ట్రెండ్ హాలీవుడ్ లో దశాబ్దాల క్రితమే మొదలైంది. ఇండియాలో ఓ దశాబ్దకాలంగా ప్రాచుర్యం పొందుతుంది. బాహుబలి(Baahubali), కేజిఎఫ్, పుష్ప(Pushpa) చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కాయి. అవి మొదటి భాగానికి మించిన విజయాలను సొంతం చేసుకున్నాయి. మొదటి భాగంలో అసంపూర్తిగా ఉన్న కథలకు సీక్వెల్ లో ముగింపు ఉంటుంది. బాలీవుడ్ లో ధూమ్, వార్ వంటి ప్రాంఛైజీలు ఉన్నాయి. ఇవి కూడా సీక్వెల్స్ వంటివే. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ రావాల్సి ఉంది. ఈ చిత్రాల కథలను పార్ట్ 2లో అసంపూర్తిగా ముగించారు.
ఇందుకు భిన్నంగా బాలీవుడ్(Bollywood) లో ఒక ట్రెండ్ నడుస్తుంది. సౌత్ హిట్ చిత్రాలను రీమేక్ చేస్తున్న కొందరు హీరోలు… వాటికి సీక్వెల్స్ గా సంబంధం లేని మరో సినిమాలను ఎంచుకుంటున్నారు. బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ విషయానికి వస్తే… ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం ని భాగీ టైటిల్ తో రీమేక్ చేశాడు. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ కొట్టింది. భాగీ చిత్రానికి సీక్వెల్ గా భాగీ 2 చేశాడు. భాగీ 2 మరో తెలుగు హిట్ క్షణం చిత్రానికి రీమేక్. వర్షం రొమాంటిక్ యాక్షన్ డ్రామా కాగా, క్షణం క్రైమ్ థ్రిల్లర్. ఈ రెండు కథలకు సంబంధం లేదు.
భాగీ 3 సైతం చేశాడు టైగర్ ష్రాఫ్. తమిళ హిట్ మూవీ వెట్టై ని భాగీ 3 టైటిల్ తో రీమేక్ చేశారు. ప్రస్తుతం కన్నడ దర్శకుడితో భాగీ 4 పట్టాలెక్కిస్తున్నారు. ఇది కూడా సౌత్ ఇండియాకు చెందిన హిట్ మూవీ రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. అలాగే జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్. 2018లో విడుదలైన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కి జంటగా ఇషాన్ కట్టర్ నటించాడు. ధడక్ హిట్ టాక్ తెచ్చుకుంది. జాన్వీ కపూర్ కి మంచి ఆరంభం లభించింది.
ధడక్ మూవీ మరాఠీ హిట్ చిత్రం సైరాత్ కి రీమేక్ కావడం విశేషం. పరువు హత్యల నేపథ్యంలో ధడక్ తెరకెక్కించారు. కాగా ధడక్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ధడక్ 2లో యానిమల్ ఫేమ్ త్రిప్తి డుమ్రి, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటిస్తున్నారు. ధడక్ 2 సైతం రీమేక్ కావడం విశేషం. తమిళ చిత్రం పెరియారుమ్ పెరుమాళ్ చిత్రానికి ధడక్ 2 అధికారిక రీమేక్ అని తెలుస్తుంది. ఈ మూవీ సామాజిక అసమానతలు ప్రేమకథగా తెరకెక్కింది. ఆ విధంగా సీక్వెల్ కి కొత్త నిర్వచనం చెబుతున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇతర భాషా చిత్రాల రీమేక్స్ ని సీక్వెల్స్ గా ప్రకటించి క్యాష్ చేసుకుంటున్నారు.