నటీనటులుః సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణి, నిఖిత్ ధీర్, హిమాన్షో, తదితరులు
నిర్మాతః యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్, అజయ్ షా, హిమాన్షు గాంధీ
సంగీతంః తనిష్ బాగ్చి, బి ప్రాక్, జస్లీన్ రాయల్, జావేద్ మోషిన్, జానీ, విక్రమ్, జాన్ స్టీవర్ట్
దర్శకత్వంః విష్ణువర్ధన్
రిలీజ్ః అమెజాన్ ప్రైమ్
సినిమాలకు ఎవర్ గ్రీన్ కాన్సెప్టుల్లో ఒకటి దేశభక్తి. కమర్షియల్ హంగులు జోడించి సరిగ్గా ప్రజెంట్ చేస్తే.. ఖచ్చితంగా విజయానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే.. దేశభక్తి అనేది యువతలో చాలా వరకు జీర్ణించుకుపోయి ఉంటుంది. అలాంటి చిత్రమే షేర్షా. కార్గిల్ పోరాటంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ భత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మరి, ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్నది చూద్దాం.
కథః ఆర్మీలో చేరాలన్నది విక్రమ్ భత్రా (సిద్ధార్థ్ మల్హోత్రా) చిన్న నాటి కోరిక. ఆ కోరిక అతనితోపాటే పెరుగుతుంది. పెద్దయ్యాక డింపుల్ (కియారా అద్వాణి) తో ప్రేమలో పడతాడు. కానీ.. తన లక్ష్యాన్ని మాత్రం మరచిపోడు. అటు తండ్రిని, ఇటు ప్రేయసిని ఒప్పించి ఆర్మీలోకి ప్రవేశిస్తాడు. అయితే.. కార్గిల్ వార్ లో ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? అప్పుడు శత్రువులతో ఎలా పోరాటం సాగించాడు? ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు? అన్నది మిగిలిన కథ.
కథనంః బయోపిక్ అన్నది ఎప్పుడూ కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటే.. వారి జీవితం అప్పటికే ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది. కాబట్టి.. కథను మార్చడానికి కుదరదు. తెలిసిన కథ చుట్టూనే సన్నివేశాలు అల్లుకుంటూ పోవడం.. వాటి ద్వారా ప్రేక్షకులను మెప్పించడం అనేది అంత తేలికైన పనికాదు. అయితే.. విక్రమ్ భత్రా కథను అంగీకరించేలా తీశాడు దర్శకుడు విష్ణువర్ధన్. ప్రేమ కథతోపాటు ఆర్మీని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాడు. ఆర్మీలో ఉగ్రదాడి తర్వాత టర్న్ తీసుకున్న మూవీ.. ఎండింగ్ వరకూ అదే టెంపోను కొనసాగించింది. యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాడు. దేశభక్తి సినిమా ఎలా ఉండోలా అలా చూపించాడు. పలు సన్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. దేశాన్ని ప్రేమించి వారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. అయితే.. ఫస్ట్ హాఫ్ లో కథ కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్ః విక్రమ్ భత్రా పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా జీవించాడని చెప్పాలి. దేశ భద్రత కోసం తపించే ఒక సైనికుడిగా అద్భుతమైన హావభావాలను పలికించాడు. యుద్ధ సన్నివేశాల్లో గొప్పగా నటించాడు. ఈ సినిమాను వన్ మాన్ ఆర్మీగా నడిపించాడు. కియారా అద్వాని తన పరిధిమేరకు నటించింది. మిగిలిన నటీనటులు కూడా న్యాయం చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.
బలాలుః సిద్ధార్థ్ మల్హోత్రా, డైరెక్షన్
బలహీనతః ఫస్ట్ హాఫ్ లో స్లో నెరేషన్
లాస్ట్ లైన్ః గర్జించిన ‘షేర్షా’
రేటింగ్ 2.75 / 5