ఎదుటివారిని నవ్వించాలంటే ఒక చిత్రమైన పని చెయ్యాలి లేదా తమాషా విషయాన్ని చెప్పాలి… కానీ ఒక మహానుభావుడుని చూస్తే చాలు ఉన్నపళంగా నవ్వేయాలనిపిస్తుంది. ఎలాంటి సిట్యుయేషన్ లో ఉన్నప్పటికీ ఆయన మన ఊహలోకి వచ్చారంటే మది మురిసిపోవటం ఖాయం. ఆయనే హాస్య నట చక్రవర్తి … బ్రహ్మానందం గారు. రేలంగి, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య తర్వాత హాస్య నటనలో వారిని మించిపోయి తెలుగు ప్రేక్షకుల ఆరోగ్యం కాపాడుతూ ఉన్న డాక్టర్ ఆయన. నేటితో 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న హాస్య బ్రహ్మకి జన్మ దిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం…
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. పెద్దయ్యాక అత్తిలిలో తెలుగు అధ్యాపకునిగా కొనసాగుతూనే పలు సాంస్కృతిక కార్యక్రమాలలో తన స్వరఅనుకరణతో అలరించే వారు. అనూహ్యరీతిలో లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల ‘సత్యాగ్రహం’లో ఓ చిన్న పాత్రలో తొలిసారి వెండితెర మీద ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’లో అరగుండుగా వీర విహారం చేసి అందరనీ కడుపుబ్బా నవ్వించారు. ఇక ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పాత్ర ఏదైనా బ్రహ్మనందం అందులో జీవించేవారు.
మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. గిన్నీస్ బుక్స్ లో కూడా చోటు సంపాదించాడు. ఆయన వల్లనే చాలా సినిమాలు హిట్ అయ్యాయని, స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బ్రహ్మానందం నవ్వినా, ఏడ్చినా, కోప్పడినా, చికాకు పడినా, వెటకారం చేసినా… అసలు ఆయన ఏం చేసినా అందులో ఫన్ జెనెరేట్ అవుతుంది. సినిమాలో బ్రహ్మి ఎంటర్ అవుతుంటే… ఒక హీరోకి ఫ్యాన్స్ చేసే గోలకన్నా ఎక్కువగానే రచ్చ జరుగుతుంది. ఆ రేంజ్ లో ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నారు.
Also Read: రాజమౌళికి సీనియర్ల పట్ల గౌరవం లేదట !
ఆయన సినీ ప్రస్థానంలో చేసినవన్నీ అద్భుత పాత్రలే అయినప్పటికీ… అరగుండు, ఖాన్‌దాదా, మైఖెల్ జాక్సన్, కిల్ బిల్ పాండే, చిత్రగుప్త, మెక్‌డోల్డ్ మూర్తి, భట్టు, బద్దం భాస్కర్, గచ్చిబౌలి దివాకర్, శాస్త్రి, చారి, హల్వారాజ్, పద్మశ్రీ, ప్రణవ్, జయసూర్య, నెల్లూరు పెద్దారెడ్డి లాంటి కొన్ని పాత్రలు మాత్రం ఎవర్గ్రీన్ గా నిలిచిపోయాయి. వెండి తెరపై తనదైన ముద్ర వేసిన బ్రహ్మానందం… కెరీర్లో ఐదు నందులు ,ఒక ఫిల్మ్ ఫేర్, సైమా, ‘మా’ అవార్డులతో పాటు 2010లో పద్మ శ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.ఒకప్పుడు తీరికలేకుండా సినిమాలు చేసిన ఆయన, వయసు మీదపడటం, అనారోగ్య కారణాల వలన ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించేశారు.
Also Read: రోబో స్టోరీ వివాదంలో శంకర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్
నటన మాత్రమే కాదు ఆయనలో చాలా కళలు కూడా ఉన్నాయి. అందులో చిత్రలేఖనం ఒకటి. ఆయన కుంచె నుండి జాలువారిన చిత్రాలు మీడియాలో దర్శనమిచ్చాయి. ఇటీవల లాక్ డౌన్ సమయంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ గీశారు. ఆ పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మధ్య స్టార్ హీరోల పుట్టిరోజు మరికొన్ని రోజులలో వస్తుంటే ఆ హీరో అభిమానులు సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయటం అలవాటుగా మారింది. స్టార్ హీరో రేంజ్ లో #hbdbrahmanandam అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఫొటోలతో మీమ్స్, ఆయన జిఫ్ లతో చాటింగ్ లు ఇప్పుడు పెద్ద ట్రెండ్. దీన్ని బట్టి ఆయన మీద అభిమానం ఎలా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.
ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘రాములో రాములా’ పాటలో తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో బ్రహ్మానందం నటిస్తున్నారు. ఇలానే మరిన్ని సినిమాలలో నటించి మనల్ని నవ్విస్తూనే ఉండాలని ఆశిస్తూ… ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు నవ్వుతూ జీవించాలని ప్రార్థిస్తూ… మరొకసారి మన బ్రాహ్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.