
తెలుగులోనే నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు వేళైంది. బుల్లితెర ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆ సందర్భం రానే వస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ షో ప్రారంభం కానుంది.
తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తికాగా.. తాజాగా ఐదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ షోకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను తాజాగా స్టార్ మా చానెల్ ఇచ్చింది. ఆశగా ఎదురుచూస్తున్న వారందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఐదో సీజన్ కు హోస్ట్ గా రానా వస్తాడని.. హోస్ట్ గా ఈసారి కొత్త హీరో రానున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ తాజాగా స్టార్ మా చానెల్ రూపొందించిన ప్రమోలో బిగ్ బాస్ ను హోస్ట్ చేసేది నాగార్జున అన్న విషయం తేటతెల్లమైంది.
నాగార్జున ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను శనివారం స్టార్ మా విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా ‘బోరింగ్ కు ఇక బిగ్ బాస్ తో చెక్’ అనే కాన్సెప్ట్ గా ప్రోమోలో అద్భుతంగా తీర్చిదిద్దారు.అంతేకాదు.. ఈ ప్రోమోతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు హోస్ట్ నాగార్జునే అనే క్లారిటీని ఇచ్చేశారు. ‘బోర్ డమ్ కు గుడ్ బై చెబుదాం.. వచ్చేస్తోంది బిగ్ బాస్ 5’ అంటూ నాగార్జున చెప్పిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
నాగార్జున హోస్ట్ అని ఖాయం అయిపోయింది. ఇక సెప్టెంబర్ 5 నుంచి షో నడస్తుందని తేలిపోయింది. మరి కంటెస్టెంట్లు ఎవరన్న ఆసక్తి మాత్రం ఉత్కంఠ రేపుతోంది. వాళ్లు ఎవరో తెలియాలంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.