Bigg Boss Telugu OTT Winner: జనాలకు ఇప్పుడు ‘రియాలిటీ’ కావాలి.. వారికి రియల్ ఎమోషన్ కావాలి.. అందుకే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఆదరణ చూరగొంటున్నాయి. పాత చింతకాయపచ్చడి లాంటి సీరియళ్లను చూసి బోర్ కొట్టిన జనాలకు ‘బిగ్ బాస్’ అయస్కాంతంలా ఆకర్షించింది. అక్కున చేర్చుకుంది. ఇందులోని రియల్ ఎమోషన్లకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగునాట అయితే టీవీలకు అతుక్కుపోతున్నారు.
తొలి ఐదు సీజన్లు హిట్ కావడంతో ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ బాటపట్టింది. 24 గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. తెలుగు నాట రియాలిటీ షోలకు క్రేజ్ తగ్గలేదని ఈ ఓటీటీ షో నిరూపించింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో మొదటి సీజన్ ప్రారంభమైంది. ఇందులో బిగ్ బాస్ లో ఇదివరకూ పాల్గొన్న పాత కంటెస్టెంట్లు , కొత్త వారిని చేర్చారు. తొలి సీజనే యమరంజుగా సాగుతోంది. షో ఆరంభం నుంచే ఈ రచ్చ రచ్చ సాగుతోంది.
ఈసారి ఓటీటీలోకి బిగ్ బాస్ ఎక్కడంతో గతంలో లేనట్టుగా బోల్డ్ టాస్కులు కూడా బిగ్ బాస్ పెట్టేశాడు. హాట్ హాట్ గా మాటలు, చేష్టలతో కంటెస్టెంట్లు అలరిస్తూనే ఉన్నారు. 17మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ ఓటీటీలో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్ నుంచి శ్రీరాపాక, సరయూ, తేజస్వి, ఆర్జే చైతు, స్రవంతిలు బయటకొచ్చారు. ఇప్పుడు హౌస్ లో కేవలం 11 మంది మాత్రమే మిగిలారు.
బిగ్ బాస్ ఓటీటీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతివారం జరుగుతున్న ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తే అందులో ఐదుగురు కంటెస్టెంట్లకు భారీగా ఓట్లు పడుతున్నాయి. వారి ఆటకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు ఓట్ల వర్షం కురిపిస్తున్నారు.అఖిల్-బిందుమాధవిల మధ్య ఫైట్ తొలివారం నుంచే మొదలైంది. ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు.
ఇందులో అందరికంటే ఎక్కువగా ఓట్లు పడుతున్నవి లేడీ కంటెస్టెంట్ బిందుమాధవికే. ఆమె ఆట, హౌస్ లో వ్యవహరిస్తున్న తీరుతో ప్రేక్షకుల మద్దతు ఆమెకే దక్కుతోంది. ఇక రెండో స్థానంలో అఖిల్ సార్థక్ ఉన్నాడు. అతడికి కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదివరకూ బిగ్ బాస్ రన్నరప్ కావడంతో ఈసారి కూడా భారీగానే ఓట్లు పడుతున్నాయి.
ఇక యాంకర్ గా, బిగ్ బాస్ లో ఇదివరకూ కంటెస్టెంట్ గా ఉన్న ఆషురెడ్డి ఓటింగ్ లో 3వ స్థానంలో ఉంది.ఈమె తర్వాత అరియానా గ్లోరీ, యాంకర్ శివలు టాప్ 5లో ఉన్నారు. అరియానా, ఆషురెడ్డిలకు క్రేజ్ ఉన్నా వీరి ఆట తీరు చూస్తే విన్నర్ కానీ.. రన్నర్ కానీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఐదుగురే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారని ప్రేక్షకులు చెబుతున్నారు. నటరాజ్ మాస్టర్, అజయ్ లకు ఛాన్స్ ఉందని అంటున్నారు.
యాంకర్ శివ ప్రస్తుతం ఉన్న వాళ్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి గేమ్ లో అందరికంటే స్ట్రాంగ్ అయ్యాడు. టైటిల్ రేసులోనూ గట్టి పోటీనిస్తున్నారు. ప్రేక్షకుల మద్దతును భారీగా సంపాదిస్తున్నారు. శివకు కాలం కలిసి వస్తే విన్నర్ గానూ నిలవొచ్చు అని అంటున్నారు.
ఈసారి టాప్ 1లో ఒక లేడీ కంటెస్టెంట్ బిందుమాధవి ఉండడం విశేషంగా చెప్పొచ్చు. బిగ్ బాస్ చరిత్రలో లేడి కంటెస్టెంట్ బిగ్ బాస్ విజేతగా గెలిచిన చరిత్ర లేదు. గతంలో గీతామాధురి, శ్రీముఖిలు చివరివరకూ పోరాడి రన్నరప్ గా నిలిచారు. హరితేజ , అరియానా, సిరి సహా కొంతమంది లాంటి వారు టాప్ 5లో ఉన్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా బిందుమాధవి బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ గెలవడం పక్కా అంటున్నారు.
అఖిల్ కంటే బిందుమాధవి పైచేయి సాధిస్తోంది. అఖిల్ గ్రూపులతో గేమ్ ఆడుతూ కొంత నెగెటివ్ తెచ్చుకుంటున్నాడు. పైగా ఇతరులపై ఆధారపడి ఆడడం మైనస్ గా మారుతోంది. సొంతంగా గేమ్ లలో ముందుకు సాగడం లేదు. బిందుమాధవికి గ్రూప్ ఉన్నప్పటికీ అఖిల్ లా గ్రూపిజం లేదు. అదే ప్లస్ అవుతోంది. ఇక తప్పును తప్పు అని బిందుమాధవి చెప్పినట్టుగా అఖిల్ చెప్పలేకపోతున్నాడు.
గత సీజన్ లో హౌస్ లో తన ఆట, మాట, గేమ్ తీరుతూ అనూహ్యంగా సన్నీ విన్నర్ గా గెలిచాడు. యాంకర్ రవి లాంటి వారిని కూడా పక్కకు తప్పించాడు. బిగ్ బాస్ ఓటీటీలోనూ చివరి వరకూ ఏదైనా జరగవచ్చు. ఫ్యాన్ బేస్ ఎటైనా మారవచ్చు. ప్రస్తుతానికి బిందుమాధవి, అఖిల్ లు టాప్ 2 కంటెస్టెంట్లుగా ఉన్నారు. బిందు స్వచ్ఛమైన ఆటతీరుతో ప్రేక్షకుల మదిని దోచేస్తోందని.. అఖిల్ కన్నింగ్ మెంటాల్టీతో రెండో స్థానంలోకి దిగజారిపోతున్నాడని తెలుస్తోంది. మరి చివరి వరకూ ఈ టెంపో కొనసాగుతుందా? బిందుమాధవి టైటిల్ గెలుస్తుందా? అన్నది వేచిచూడాలి.