Bigg Boss Telugu 8 : నత్త నడకన సాగిన ఈ సీజన్ బిగ్ బాస్ కి టైటిల్ విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతమ్ నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. నిఖిల్ ని విన్నర్ గా ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియా లో గౌతమ్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఈ సీజన్ లో అందరికంటే అత్యధిక ఓటింగ్ గౌతమ్ కి వచ్చిందని, కానీ స్టార్ మా ఛానెల్ వాళ్ళు నిఖిల్ ని విన్నర్ ని చేసారని, ఇది చాలా మోసం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసారు. షో పూర్తి అయ్యి పది రోజులు కావొస్తున్నా కూడా ఇంకా వేడి తగ్గలేదు. దీని గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ టాప్ 4 కంటెస్టెంట్ గా నిల్చిన ప్రేరణ, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వాదనపై చాలా ఘాటుగా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ ‘నిఖిల్ స్టార్ మా ఛానల్ లో సీరియల్స్ చేస్తున్నాడు కాబట్టి, అతన్ని విన్నర్ గా ప్రకటించారని సోషల్ మీడియా లో చాలా కామెంట్స్ చూసాను. స్టార్ మా వాళ్ళు నిఖిల్ కి ఏమైనా చుట్టమా?, బిగ్ బాస్ టీం లో నిఖిల్ అమ్మా నాన్న ఉన్నారా?, ఎలా అంటారు గౌతమ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ని విన్నర్ ని చెయ్యరు అనే వాదన కూడా వినిపిస్తుంది. అలా రూల్స్ రాసిపెట్టి ఎక్కడా లేదే. నా అభిమానులు కూడా నన్ను గెలవాలని కోరుకున్నారు. వాళ్ళు కూడా ఇలాంటి ప్రచారాలు చెయ్యొచ్చు కదా. సోషల్ మీడియా లో కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అని పెద్ద ఎత్తున క్యాంపైన్ చేశారు. కానీ తెలుగోళ్లు కన్నడవాడు అయిన నిఖిల్ కి ఓటు వేసి గెలిపించారు. ఆడియన్స్ కేవలం ఆట ని చూస్తారు కానీ, ఏ ప్రాంతం నుండి వచ్చారు?, ఏ బాషా అనేది చూడరు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ గౌతమ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని వీళ్లకు ఎలా తెలిసింది?, ఒకవేళ ఎక్కువ వచ్చి ఉంటే ఆధారాలు చూపించండి. ఆధారాలు చూపించకుండా గాలి మాటలు మాట్లాడకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ. అదే విధంగా కే బ్యాచ్ ట్రోల్స్ పై ఆమె స్పందిస్తూ ‘మేము పక్క రాష్ట్రాల నుండి వచ్చినప్పటికీ, ఇక్కడ సీరియల్స్ చేస్తే తెలుగు ఆడియన్స్ మమ్మల్ని ఆదరించారు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం తెలుగు ఆడియన్స్ మాత్రమే. వాళ్ళ కోసమే మేము స్పష్టమైన తెలుగు ని కూడా నేర్చుకున్నాం, తెలుగులోనే మాట్లాడుతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా రీసెంట్ గా ఆమె మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చింది.