Manmohan Singh : నేడు ప్రపంచం మొత్తం కొనియాడుతున్న ఉపాధి, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాలు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోనే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉపాధి పథకం అమలవుతోంది అంటే.. దాని రూపకల్పనలో మన్మోహన్ సింగ్ ఎంత ఆలోచించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్లే దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతోంది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే దేశ వ్యాప్తంగా పాఠశాలల నిర్మాణం ఊపందుకుంది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ రేటు తగ్గింది. బడి బాట వంటి కార్యక్రమాలు రూపొందడానికి ప్రధాన కారణం విద్య హక్కు చట్టం అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇక సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో తెరవెనుక భాగవతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. వ్యవస్థలో కొంతలో కొంత సచ్చిలత బయటికి వచ్చింది. సమాచార హక్కు చట్టం వల్లనే చాలావరకు అక్రమాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రతి పథకానికి కీలకంగా మారిన ఆధార్ కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఆధార్ కార్డు వల్లే నేడు ఎటువంటి అక్రమాలు లేని నగదు బదిలీ జరుగుతోంది. ఇన్ని విప్లవాత్మక నిర్ణయాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరగడం విశేషం.
అది ఆయన స్టైల్
మన్మోహన్ సింగ్ ను చాలామంది మౌనముని అని పిలిచేవాళ్ళు. కానీ మనోహన్ సింగ్ దానిని ఒప్పుకునే వాళ్ళు కాదు. ఆయన ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే వాళ్ళు. అదేవిధంగా చెప్పేవాళ్లు. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు మన్మోహన్ సింగ్.. విమానం దిగడమే ఆలస్యం వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించేవాళ్లు. ఆ సమయంలో మీడియా ఎటువంటి విషయాన్ని లేవనెత్తినప్పటికీ గొంతు తడమకోకుండా సమాధానం చెప్పేవాళ్ళు. తన ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవకతవకలు జరిగినా.. దానిని మీడియా లేవనెత్తినా వెంటనే సమాధానం చెప్పేవాళ్ళు. నాడు జాతీయ మీడియాలో కీలకంగా పనిచేసిన వారు ఇవాల్టికి ఇదే విషయాన్ని చెబుతుంటారు. మొదట్లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ ను మీడియా ప్రస్తావించేది. కానీ ఆయన తన పదవీకి రాజీనామా చేసిన సమయంలో.. ఎవరు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా చరిత్ర అనేది ఒకటి ఉంటుందని.. అది ఏదో ఒక రోజు తనను గుర్తు చేస్తుందని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జాతీయ మీడియా 2014 కు ముందు.. ఆ తర్వాత జరుగుతున్న పరిపాలనను దృష్టిలో పెట్టుకొని మన్మోహన్ సింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 117 సార్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశ ప్రధానిగా అరుదైన రికార్డును సాధించారు. మీడియా ముందు మాట్లాడేందుకు ఆయన భయపడేవారు కాదు. పైగా ఒక్కోసారి విమానంలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించేవారు.. మనోహన్ సింగ్ గురువారం కన్నుమూసిన నేపథ్యంలో.. ఆయన పార్థివ దేహానికి శనివారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన భౌతిక దేహాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి తరలించి.. కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు.