Bigg Boss Telugu 8: నాగార్జున తెలుగు బిగ్ బాస్ కి మూడవ సీజన్ నుండి హోస్టింగ్ చేస్తున్నాడు, కానీ ఏ సీజన్ కి రానటువంటి నెగటివిటీ ఈ సీజన్ కి వచ్చింది. కేవలం ఒక్క వారం మాత్రమే ఆయన సరైన హోస్టింగ్ చేసినట్టుగా అనిపించింది. మిగిలిన వారాలు మొత్తం ఆయన కామెడీ చేసి పారేసాడు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. ప్రతీ శనివారం, ఆదివారం జరిగే ఎపిసోడ్స్ లో శనివారం రోజు కంటెస్టెంట్స్ వారం మొత్తం చేసే తప్పులను ఎత్తిచూపడం, బాగా ఆడిన వారిని ప్రోత్సహించడం వంటివి చేస్తాడు. ఆదివారం రోజు కంటెస్టెంట్స్ తో ఫన్నీ టాస్కులు ఆడిస్తాడు. కానీ ఈసారి ఆయన శనివారం ఎపిసోడ్స్ ని కూడా ఫన్నీ చేసేసాడు. ముఖ్యంగా కష్టపడి ఆడిన కంటెస్టెంట్స్ ని గుర్తించడం లేదు, తప్పులు చేసిన కంటెస్టెంట్స్ ని నిలదీయడం లేదు, సీరియస్ గా మాట్లాడాల్సిన అంశాలను కూడా ఆయన కామెడీ చేసేస్తున్నాడు.
మణికంఠ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి అతనిపై విరుచుకుపడే వాడు నాగార్జున. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ అదే తప్పు చేసినప్పుడు సుతి మెత్తని మాటలతో కవర్ చేసేస్తున్నాడు. నాగార్జున నుండి ఇలాంటి చెత్త హోస్టింగ్ ఆశించలేదని విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. ముఖ్యంగా గత వారం టేస్టీ తేజా ఆడిన తీరుకి సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. ఆ శరీరంతో ఆయన పడిన కష్టానికి, ఆడిన తీరుని కచ్చితంగా అభినందించాల్సిందే. కానీ నాగార్జున అసలు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో తేజ ఆట తీరు ప్రస్తావనే తీసుకొని రాకపోవడం అన్యాయం అనిపించింది. అలాగే ప్రేరణ కి కూడా దక్కాల్సిన గౌరవం ఇన్ని రోజులు దక్కలేదు. బాగా ఆడే కంటెస్టెంట్స్ ని ప్రోత్సహిస్తే వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో ఆడుతారు. గత వారం నిఖిల్, పృథ్వీ ఆట తీరుని మెచ్చుకున్నాడు. అందులో ఎలాంటి తప్పు లేదు, కానీ వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా టేస్టీ తేజ ఆడాడు, అతన్ని కూడా అభినందించాలిగా?, కమెడియన్స్ అంటే అంత చిన్న చూపా నాగార్జునకి? అనే అభిప్రాయం కూడా సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వ్యక్తమైంది.
ఇవన్నీ పక్కన పెడితే ప్రతీ దీపావళి ఎపిసోడ్ కి అతిథిగా విచ్చేసి కంటెస్టెంట్స్ గురించి వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ, బయట జనాలు ఏమని అనుకుంటున్నారు అనే దానిపై కంటెస్టెంట్స్ కి హింట్స్ ఇస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఈ దీపావళి ఎపిసోడ్ కి కూడా ఆయన అతిథిగా విచ్చేశాడు. కంటెస్టెంట్స్ ఆట తీరుపై వ్యంగ్యంగా మాట్లాడుతూనే, వాళ్ళ పాజిటివ్స్ ని కూడా చెప్తూ, రాబోయే ఎపిసోడ్స్ నుండి గేమ్స్ ఎలా ఆడాలి అనే దానిపై కూడా ఆయన హింట్స్ ఇచ్చాడు. నాగార్జున 8 వారాలుగా చేయలేని పనిని, హైపర్ ఆది కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ తో చేసాడు అని అనిపించింది. దీంతో హైపర్ ఆదిపై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిసింది. నాగార్జున ని హోస్టింగ్ నుండి తప్పించి, ఆ స్థానంలో హైపర్ ఆదిని తీసుకోవడం ఉత్తమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.