Bigg Boss Telugu 7: ఆదివారం ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూజ మూర్తి రెండు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. వరుసగా మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇంటి బాట పట్టింది. అదే సమయంలో రతికా రోజ్ ఇంట్లోకి వచ్చింది. శుభశ్రీ, దామిని, రతిక రోజ్ లలో హౌస్ మేట్స్ ఓటింగ్ ఆధారంగా ఒకరికి రీఎంట్రీ ఛాన్స్ అన్నాడు నాగార్జున. ఓటింగ్ అనంతరం ట్విస్ట్ ఇస్తూ… తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని షాక్ ఇచ్చాడు. దాంతో హౌస్ మేట్స్ తిరస్కరించిన రతిక రోజ్ హౌస్లో అడుగుపెట్టింది.
సోమవారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ప్రతి కంటెస్టెంట్స్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. వాళ్ళ ఫోటోలు మంటల్లో కాల్చివెయ్యాలని ఆదేశించాడు. కెప్టెన్ అర్జున్, కొత్తగా హౌస్లోకి వచ్చిన రతికలను నామినేట్ చేయడానికి వీల్లేదు అన్నాడు. శివాజీతో ప్రక్రియ మొదలైంది. శివాజీ… శోభా శెట్టి, ప్రియాంకలను చేశాడు. భోలే మాట్లాడింది 200% తప్పే. కానీ వయసులో పెద్దవాడు. మనతో ఉంటున్నవాడు క్షమిస్తే తప్పేంటి అని శోభాను నామినేట్ చేశాడు. దేవుడు నాకు క్షమించే గుణం ఇవ్వలేదని శోభా అన్నది.
ఇక ప్రియాంకను కూడా దాదాపు ఇదే రీజన్ తో నామినేట్ చేశాడు. నువ్వు సారీ చెప్పినప్పటికీ థూ అనడం సరికాదని అన్నాడు. అశ్విని కూడా శోభా శెట్టి, ప్రియాంకలను నామినేట్ చేసింది. గౌతమ్… పల్లవి ప్రశాంత్, భోలేలను చేశాడు. గౌతమ్-పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం నడిచింది. అనంతరం ప్రియాంక… భోలే, అశ్వినిలను నామినేట్ చేసింది. మరలా ప్రియాంకతో భోలేకి లొల్లి అయ్యింది.
సందీప్.. అశ్విని, భోలేలను, శోభా శెట్టి… శివాజీ, యావర్ లను నామినేట్ చేసింది. ఒకవేళ భోలే పట్ల నేను దురుసుగా ప్రవర్తిస్తే, అతన్ని క్షమించకపోతే హౌస్లో చెప్పాల్సింది. నామినేషన్స్ లో చెప్పి నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావని శోభా శివాజీ మీద ఆరోపణ చేసింది. ఎవరూ నిన్ను బయటకు పంపలేరు. నువ్వు మాత్రం నిన్ను బయటకు పంపగలవు అన్నాడు. ఇక భోలే… శోభా శెట్టి, గౌతమ్ లను నామినేట్ చేశాడు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. నేటి ఎపిసోడ్ తో ఎవరెవరు నామినేషన్స్ లో ఉంటారో తెలుస్తుంది.